మళ్లీ ఎల్ వోసీ వెంట ఉగ్రవాదుల చొరబాటు యత్నం.. తిప్పికొట్టి, ఇద్దరిని హతమార్చిన ఆర్మీ..
జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఇద్దరు ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భారత సైనికులు హతమార్చారు.

జమ్మూకాశ్మీర్ లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాన్ని ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టారు. నియంత్రణ రేఖ వద్ద అనుమానాస్పద కదలికలను గమనించిన భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆపరేషన్ చేపట్టారు.
ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీకి చెందిన ‘వైట్ నైట్ కార్ప్స్’ ఓ ట్విట్టర్ పోస్టులో తెలిపింది. సైన్యం, జమ్ముకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్ లో చొరబాటు యత్నాన్ని భగ్నం చేశామని, ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ‘ పూంచ్ సెక్టార్ లో ఆపరేషన్ బహదూర్ కొనసాగుతోంది. జూలై 17 రాత్రి పూంచ్ సెక్టార్ లో ఆర్మీ, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో భారీ చొరబాటు యత్నాన్ని విఫలం చేశాం. ఇద్దరు చొరబాటుదారులను మట్టుబెట్టాం’ అని ట్వీట్ చేసింది. ఆది, సోమవారాల్లో అర్ధరాత్రి ఈ ఆపరేషన్ చేపట్టారు.
ఇదిలా ఉండగా.. ఇదే నెల 10వ తేదీన కూడా రాజౌరీ జిల్లాలోని నౌషెరా సెక్టార్ లోకి నియంత్రణ రేఖ వెంబడి చొరబడేందుకు ఉగ్రవాది చేసిన ప్రయత్నాలను భారత సైన్యం తిప్పికొట్టింది. చొరబాటుకు వ్యతిరేకింగా సైన్యం భారీ ఆపరేషన్ చేపట్టి విజయం సాధించింది. ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టింది. ఆ ఉగ్రవాది సోమవారం రాత్రి నియంత్రణ రేఖ వెంబడి నౌషెరా సెక్టార్ లో చొరబాటుకు యత్నించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
స్కూల్ లో టాయిలెట్ కు వెళ్లి తిరిగి రాని 11 ఏళ్ల బాలిక.. ఏమైందో అని వెళ్లి చూస్తే షాక్..
కాగా.. రాజౌరీ సెక్టార్ నియంత్రణ రేఖ వద్ద ఆపరేషన్, భద్రతా సన్నద్ధతను ఆర్మీ నార్తర్న్ కమాండ్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సోమవారం సమీక్షించారు. సైనికుల ఉన్నత స్థాయి ప్రొఫెషనలిజం, అప్రమత్తతను ఆయన ప్రశంసించారు. ఉపేంద్ర ద్వివేది రాజౌరీ ప్రాంతంలోని ఫార్వర్డ్ రెజిమెంట్ ను సందర్శించారని భారత సైన్యం అధికారిక ప్రకటనలో తెలిపింది.