పాక్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ-కశ్మీరులోని రాజౌరీ జిల్లాలో, నౌషేరా సెక్టర్‌లో నియంత్రణ రేఖ వెంబడి శనివారం పాకిస్థాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో ఓ భారతీయ జవాను అమరుడయ్యారు. పాకిస్థాన్ దళాలకు భారతీయ దళాలు దీటుగా బదులిస్తున్నట్లు భారత సైన్యం ఓ ప్రకటనలో తెలిపింది. 

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ దళాలు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు పేర్కొంది. ఈ కాల్పుల్లో మన దేశానికి చెందిన హవల్దార్ పాటిల్ సంగ్రామ్ శివాజీ అమరుడైనట్లు తెలిపింది. శత్రువుల కాల్పులకు మన దళాలు గట్టిగా బదులిచ్చినట్లు పేర్కొంది. సంగ్రామ్ శివాజీ మొదట తీవ్రంగా గాయపడ్డారని, ఆ తర్వాత కొద్ది సేపటికి తుది శ్వాస విడిచారని తెలిపింది. ఆయన ధైర్యసాహసాలు, నిజాయితీగల సైనికుడని తెలిపింది. ఆయన కర్తవ్యబద్ధతకు, అంకితభావానికి మన దేశం రుణపడి ఉంటుందని నివాళులర్పించింది. 

ఇదిలావుండగా, జమ్మూ-కశ్మీరులోని నగ్రోటాలో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇటీవల నలుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్ ఛార్జ్ డిఅఫైర్స్‌ను పిలిచి, నిరసన తెలిపింది.