మూడేళ్ల కొడుకును పలుగుతో కొట్టి చంపి.. పొలంలో పాతిపెట్టిన తండ్రి...
భార్యతో గొడవపడిన ఓ భర్త.. మూడేళ్ల చిన్నారిని పలుగుతో కొట్టి చంపిన హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్ : భార్యాభర్తల మధ్య గొడవలతో అభం శుభం తెలియని చిన్నారులను హతమారుస్తున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. మూడు రోజుల క్రితం బీహార్ లో జరిగిన ఘటన మరువకముందే మరో ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెడితే...
ఉత్తరప్రదేశ్ లోని ఫతేపూర్ లో ఓ భర్త భార్యతో గొడవపడ్డాడు. ఆ కోపంతో...పట్టరాని ఆవేశంతో అక్కడే ఉన్న మూడేళ్ల కొడుకు మీద చూపించాడు. ఆ చిన్నారిని అందుబాటులో ఉన్న పలుగుతో కొట్టి హతమార్చాడు. ఆ తరువాత చిన్నారి మృతదేహాన్ని పొలానికి తీసుకువెళ్లి పాతిపెట్టాడు.
బుధవారం రాత్రి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హుసేన్ గంజ్ లో వెలుగు చూసింది. వెంటనే నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. నిందితుడిని అరెస్ట్ చేశారు.
గర్ల్ ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయడానికి ఖరీదైన బైక్‌ల చోరీ.. 13 వెహికిల్స్ రికవరీ చేసుకున్న పోలీసులు
ఇదిలా ఉండగా, జనవరి 24న బీహార్ లో ఇలాంటి ఘటనే జరిగింది. భార్య మీది కోపంతో కన్నబిడ్డను అతిదారుణంగా హత్య చేసిన ఘటన బీహార్ లో కలకలం సృష్టించింది. నాలుగేళ్ల కూతురిని అత్యంత కిరాతకంగా తలనరికి చంపాడు ఓ వ్యక్తి. భార్య మీది కోపంతో ఈ పని చేసి.. ఆ చిన్నారి మృతదేహాన్ని నది ఒడ్డున పాతిపెట్టాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేసాడు. బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు అన్ని చోట్లా వెతికారు.
ఐదు రోజుల తర్వాత ఆ భర్త చావు కబురు చల్లగా చెప్పుకొచ్చాడు. భార్య మీది కోపంతో కూతురి తల నరికేసానని చెప్పాడు. భార్య వంట చేయడం లేదని కోపం వచ్చిందని.. అందుకే కూతురి తల నరికేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఈ హృదయవిధారకమైన ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బీహార్లోని సరౌని గ్రామంలో రాజకుమార్ భార్య పిల్లలతో నివసిస్తున్నాడు. అతడు మద్యానికి బానిస. ఓ రోజు మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు.
అయితే అప్పటికి రాజ్ కుమార్ భార్య ఇంకా వంట చేయలేదు. దీంతో రాజ్ కుమార్ భార్యతో తీవ్రంగా గొడవపడ్డాడు. ఆమెను బాగా కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె గట్టిగా కేకలు పెడుతూ.. తప్పించుకోవడానికి పక్కింటికి పారిపోయింది. ఈ సమయంలో ఇంట్లో నాలుగేళ్ల కూతురు ఒంటరిగా ఉంది. మద్యం మత్తులో, కన్నూ, మిన్నూ కానని కోపంలో.. ఏం చేస్తున్నాడో విచక్షణ కోల్పోయి భార్య మీద కోపాన్ని.. కూతురిపై చూపించాడు.
ఆ చిన్నారి తలను నరికేశాడు. ఆ తర్వాత సోయిలోకి వచ్చిన రాజకుమార్.. చిన్నారి మృతదేహాన్ని తీసుకువెళ్లి ఊరి చివర ఉన్న నదిఒడ్డున పాతిపెట్టి ఇంటికి వచ్చేసాడు. ఆ మరుసటి రోజు ఉదయం పక్కింట్లో నుంచి ఇంటికి వచ్చిన భార్య.. చిన్నారి పోవడంతో.. ఆమె కోసం వెతికింది. తనలాగే కూతురు కూడా భయంతో ఎక్కడికైనా పోయిందేమో అని బంధువుల ఇళ్లల్లో.. గ్రామంలోని అనేక చోట్ల వెతికింది. కానీ ఎక్కడ ఆ చిన్నారి ఆచూకీ దొరకలేదు.
ఈ క్రమంలో ఐదు రోజుల తర్వాత రాజ్ కుమార్ తనంతట తానే అసలు విషయం చెప్పుకొచ్చాడు. కూతుర్ని చంపేసి ఊరు చివర పాతేశానని తెలిపాడు. అతని మాటలు విని షాక్కు గురైన తల్లి, బంధువులు వెంటనే అతను చెప్పిన చోటుకి వెళ్లి చూడగా బాలిక మృతదేహం దొరికింది. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత రాజకుమార్ ను హత్య నేరం కింద అరెస్టు చేసి జైలుకు తరలించారు.