కారుకు దారివ్వాలని గొడవ.. ఆదివాసిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి కాల్పులు..

ఆదివాసి తెగకు చెందిన వ్యక్తిపై ఎమ్మెల్యే కుమారుడు కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి జిల్లాలో చోటు చేసుకుంది.

Argument to give way to the car.. son of BJP MLA shot at adivasi..ISR

మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ ఆదివాసిపై బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో బాధితుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారుకు దారిచ్చే విషయంలో మొదలైన గొడవ ఈ కాల్పులకు దారి తీసింది. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టించిన వారికి పోలీసులు రివార్డు కూడా ప్రకటించారు. 

వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రామ్ లల్లు వైశ్య కుమారుడు వివేకానంద్ వైశ్య గురువారం తన కారులో సింగ్రౌలి జిల్లాలో ప్రయాణిస్తున్నాడు. అతడే స్వయంగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. అయితే ఓ ప్రాంతానికి చేరుకోగానే దారి ఇరుగా మారింది. ఎదురుగా ఓ వాహనం వచ్చింది. 

దీంతో ఆ దారి నుంచి తప్పుకొని తనకు దారి ఇవ్వాలని ఎమ్మెల్యే కుమారుడు వివేకానంద్ వైశ్య ఎదురుగా ఉన్న వాహనంలో ఉన్న వారికి సూచించాడు. ఎదురుగా ఉన్న వాహనంలో ఆదివాసి తెగకు చెందిన సూర్య కుమార్ ఖైర్వార్, అతడి సోదరులు ఆదిత్య, రాహుల్ ఖైర్వార్ లు ఉన్నారు. దారి ఇచ్చే విషయంలో రెండు వర్గాలకు మధ్య గొడవ జరిగింది.

ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వివేకానంద్ తన వద్ద తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో సూర్య కుమార్ చేతికి గాయం అయ్యింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని హాస్పిటల్ కు తరలించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివేకానంద్ వైశ్య ఆచూకీ తెలిపిన వారికి రూ.10 రివార్డు ఇస్తామని ప్రకటింారు. ‘‘ఎమ్మెల్యే కుమారుడైన నిందితుడు ప్రస్తుతం మరో వ్యక్తితో కలిసి పరారీలో ఉన్నాడు. వీరిని పట్టుకున్న వారికి రూ.10 వేల రివార్డును అందజేస్తాం’’ అని సింగ్రౌలి అదనపు పోలీసు సూపరింటెండెంట్  శివకుమార్ తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios