చక్రం తిప్పుతున్న చంద్రబాబు: బిజెపి వ్యతిరేక సిఎంల భేటీ

Anti BJP CMs meet Chnadrababu
Highlights

వ్యతిరేక పార్టీలకు చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు.

బిజెపి వ్యతిరేక పార్టీలకు చెందిన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. బిజెపిని వ్యతిరేకిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఢిల్లీలోని ఎపి భవన్ కు వచ్చి చంద్రబాబుతో సమావేశమయ్యారు.

ఆదివారం జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నారు. వారంతా కలిసి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసే అవకాశం ఉంది.

ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ ఐదు రోజులుగా ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నివాసంలో ఆందోళన చేస్తున్నారు. తనకు ఐఏఎస్‌లు మద్దతివ్వడం లేదని కేజ్రీవాల్ విమర్శిస్తున్నారు. కేజ్రీవాల్‌కు నలుగురు సీఎంలు మద్దతు పలికారు.  

ప్రాధాన్యతా క్రమంలో ఎపికి నీతి ఆయోగ్ సమావేశంలో మొదటి అవకాశం వస్తుంది. దాంతో చంద్రబాబు తన ప్రసంగాన్ని బిజెపి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడే అవకాశం ఉందని అంటున్నారు. 

రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందని ఆయన విమర్శించే అవకాశం ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే సమావేశాన్ని బహిష్కరించాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

రాష్ట్రాలకు ఇచ్చే నిధుల విషయంలో తాజాగా చేసిన ప్రతిపాదన కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేసే విధంగా ఉందని ముఖ్యమంత్రులు విమర్శిస్తున్నారు. దాన్ని దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించాయి.

loader