Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ డెత్ మిస్టరీలో మరో ట్విస్ట్: ప్రియాంకకు మాంగల్యదోషం

ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఆదివారంనాడు ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణించిన ఘటనపై ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రియాంకకు మాంగల్యదోషం ఉందని భావించిన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.

Another twist in Burari daeth mystery

న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో 11 మంది కుటుంబ సభ్యుల ఆత్మహత్య కేసు మరో ట్విస్ట్ తీసుకుంది. ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మరిన్ని రిజిస్టర్లు, డైరీలు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ పెద్ద నారాయణ దేవి మనవరాలైన 33 ఏళ్ల ప్రియాంకకు మాంగల్యదోషం ఉన్నట్లు తేలడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది

 ప్రియాంకకు గత నెలలోనే నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివరలో ఆమె పెళ్లి జరగాల్సి ఉంది. ఈ స్థితిలో ఆమెకు మాంగల్యదోషం ఉందని కుటుంబ సభ్యులు భావించారు. ప్రియాంకకు తగిన సంబంధాలు కుదరక పోవడంతో తొలుత ఈ కుటుంబం కష్టాలను ఎదుర్కుంది. దీంతో నారాయణ దేవి కుమారుడు లలిత్ భాటియా తన ఇంటిలో హోమాలు చేయడం ప్రారంభించాడు. 

పదేళ్ల క్రితం చనిపోయిన తన తండ్రి కూడా ఈ హోమంలో పాల్గొన్నట్టు అతడు మిగతా కుటుంబ సభ్యులను నమ్మించాడు. తర్వాత కొద్ది రోజులకే ప్రియాంకకు సంబంధం కుదిరింది. జూన్ 17న నిశ్చితార్థం పెట్టుకున్నారు. దీంతో అతని మాటలపై కుటుంబ  సభ్యులకు గురి కుదిరింది.
 
పోలీసులకు దొరికిన మూడో రిజిష్టర్ బట్టి లలిత్ భాటియా తన తండ్రి చనిపోయిన ఏడాదినుంచే ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.  మరిన్ని ఆధారాల కోసం పోలీసులు లలిత్ కార్యాలయంలో కూడా సోదాలు చేశారు. ఆయన ఇల్లు, కార్యాలయం నుంచి మరికొన్ని రిజిస్టర్లతో పాటు పిల్లల నోట్ పుస్తకాలు, డైరీలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 20కి పైగా చేతితో రాసిన రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
 
ఇదిలావుంటే, ఈ మరణాల వెనుక గుర్తు తెలియని బాబా ఉన్నట్టు వచ్చిన అనుమానాలను పోలీసులు కొట్టిపారేశారు.  భాటియా ప్రతిరోజూ తన ఇంట్లో మూడు సార్లు పూజలు నిర్వహించేవారని, కుటుంబ సభ్యులందరూ ఈ పూజల్లో పాల్గొని ఆయన సూచనలు పాటించేవారని పోలీసులు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios