మరో పుతిన్ విమర్శకుడు ఒడిశాలో కనిపించకుండా పోయాడు. ఇటీవలే ఇద్దరు రష్యా పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. పుతిన్ విమర్శకుడని, ఉక్రెయిన్ పై యుద్ధానికి వ్యతిరేకి అని చెప్పుకున్న ఆ వ్యక్తి భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో ప్లకార్డుతో కొన్నాళ్లు కనిపించాడు. కానీ, ఇప్పుడు కనిపించకుండా పోయాడు. అతడిని వెతికి పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

భువనేశ్వర్: ఒడిశాలో రాయగడ జిల్లాలో రష్యా పౌరుల మరణం కలకలం రేపిన సంగతి తెలిసిందే. రెండు రోజుల తేడాతో ఇద్దరు మరణించారు. ఇందులో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శకుడైన ఒక చట్టసభ్యుడు ఉన్నాడు. వీరి మరణాల పైనే రకరకాల అనుమానాలు ముసురుకున్నాయి. తాజాగా, మరో రష్యా పౌరుడు, పుతిన్ విమర్శకుడు ఒడిశాలో ఆకస్మికంగా కనపడకుండా పోయాడు. దీంతో ఈ అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఇది రష్యా ఇంటెలిజెన్స్, వారి గూఢచారుల పనేనా? అనే అనుమానాలు వస్తున్నాయి.

బువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో చివరిగా కనిపించిన ఆ రష్యన్ పౌరుడు మళ్లీ కనిపించలేదు. తాను పుతిన్ విమర్శకుడు అని, ఉక్రెయిన్ పై యుద్ధానికి వ్యతిరేకి అని పేర్కొంటున్న ఓ ప్లకార్డును ఆయన పట్టుకుని నిలబడ్డాడు. తాను నిరాశ్రయుడని, సహాయం అందించాల్సిందిగా కోరుతూ ఆయన ప్లకార్డు పేర్కొంది. 60వ పడిలో ఉన్న ఆయన రైల్వే ప్లాట్‌ఫామ్ పై ప్యాసింజర్లకు కనిపించాడు.

అయితే, పోలీసులు అతని కోసం స్పాట్‌కు వెళ్లగానే కనిపించకుండా పోయాడు. ‘కొందరు ప్రయాణికులు రైల్వే స్టేషణ్‌లో ఆయనతో ఫొటోలు దిగారు. అతని ఫొటోలు తమ వద్ద ఉన్నాయని, అతని ఆచూకి కోసం చూస్తున్నాం’ అని ప్రభుత్వ రైల్వే స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జయదేవ్ బిశ్వజీత్ తెలిపారు.

Also Read: ఒడిశా హోటల్‌లో ఇద్దరు రష్యన్లు మృతి.. పుతిన్‌ను విమర్శించే చట్టసభ్యుడి మరణంపై అనుమానాలు

‘నేను ఆయన కోసం ఎంక్వైరీ చేశాను. కొన్ని రోజుల క్రితం ఇక్కడే అలాంటి ప్లకార్డు పట్టుకుని నిలబడినప్పుడు నేను చూశాను అప్పుడు అతని వీసా, పాస్‌పోర్టులు చూశాను. అవన్నీ వ్యాలిడ్‌గానే ఉన్నాయి’ అని బిశ్వజీత్ వివరించారు. 

అయితే, ఇంగ్లీష్‌లో సరిగా మాట్లాడలేకపోయిన ఆ విదేశీయుడి గురించి ఎక్కువ వివరాలు సేకరించలేకపోయానని బిశ్వజీత్ అన్నారు. అతను నిరాశ్రయుడని, తన వద్ద డబ్బులూ లేవని తనకు అర్థం అయిందని వివరించారు. కాబట్టి, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న నైట్ షెల్టర్‌లను ఆశ్రయించాలని సూచించినట్టు వివరించారు. కానీ, అందుకు అతను సిద్ధంగా లేనట్టు అనిపించిందని చెప్పారు. అతని కోసం తమ డేటాబేస్ చెక్ చేస్తామని, స్థానిక హోటల్స్‌లో ఉన్నాడమో తనిఖీ చేస్తామని భువనేశ్వర్ డీసీపీ ప్రతీక్ సింగ్ తెలిపారు.