కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రిగా వున్న ఎస్పీ సింగ్ బఘేల్‌ను ఆ శాఖ నుంచి తప్పించారు ప్రధాని నరేంద్ర మోడీ. అనంతరం ఆయనకు ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
కేంద్ర మంత్రి వర్గంలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ఉదయం న్యాయశాఖ బాధ్యతల నుంచి కిరణ్ రిజిజు నుంచి తప్పించిన కొద్దిగంటల్లోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. న్యాయ శాఖ సహాయ మంత్రిగా వున్న ఎస్పీ సింగ్ బఘేల్‌కు ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
అంతకుముందు ఉదయం కేంద్ర న్యాయశాఖ మంత్రిగా కిరణ్ రిజిజు స్థానంలో సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నియమితులయ్యారు. కీలక కేంద్ర మంత్రుల్లో ఒకరిగా పేరొందిన రిజిజుకు తక్కువ కీలకమైన ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. క్యాబినెట్ హోదాతో న్యాయ మంత్రిత్వ శాఖకు పదోన్నతి పొందిన ఏడాదిలోపే ఈ పరిణామం జరగడం గమనార్హం.
ప్రధాని సలహా మేరకు ఈ మార్పులు జరిగినట్టు రాష్ట్రపతి భవన్ పేర్కొంది. ‘‘కిరణ్ రిజిజు స్థానంలో సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నియమితులయ్యారు. ఆయనకు ప్రస్తుతం ఉన్న శాఖలకు అదనంగా న్యాయ, న్యాయ మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖను కిరణ్ రిజిజుకు కేటాయింపు జరిగింది’’ అని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు.. కేంద్ర న్యాయ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించి ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించిన కొంత సమయం తరువాత కిరణ్ రిజిజు స్పందించారు. తన కొత్త బాధ్యతల్లోనూ అదే ఉత్సాహంతో ప్రధాని నరేంద్ర మోడీ విజన్ ను నెరవేర్చడానికి ప్రయత్నిస్తానని ట్వీట్ చేశారు. న్యాయాన్ని సులభతరం చేయడంలో సహకరించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఇతర న్యాయమూర్తులు, న్యాయాధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు కిరణ్ రిజుజు ఓ ట్వీట్ చేస్తూ.. ‘‘ప్రధాని నరేంద్ర మోడీ మార్గదర్శకత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను. మన పౌరులకు న్యాయ సేవలను సులభతరం చేస్తూ.. అందించడానికి భారీ మద్దతు ఇచ్చిన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, దిగువ న్యాయ అధికారులు, మొత్తం న్యాయవ్యవస్థకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.
