దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళపై ఏఐఏడీఎంకే కేసు పెట్టింది. పార్టీ జెండాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించింది. ఆమెపైనా లీగల్ యాక్షన్స్ కూడా తీసుకుంటామని హెచ్చరించింది.  

చెన్నై: Tamil Nadu దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి VK Sasikalaపై కేసు నమోదైంది. పార్టీ జెండాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమెపై AIADMK ఫిర్యాదు చేసినట్టు సీనియర్ నేత, మాజీ సీఎం Palaniswamy వెల్లడించారు. చట్టపరమైన చర్యలూ ఆమెపై తీసుకుంటామని తెలిపారు.

వీకే శశికళకు ఏఐఏడీఎంకే పార్టీతో సంబంధం లేదని ఇప్పటికే చాలా సార్లు స్పష్టం చేశామని మాజీ సీఎం పళనిస్వామి వివరించారు. ఆమె ఏఐఏడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆమెకు జైలుకు వెళ్లడం.. పళనిస్వామి సీఎం కావడం చకచకా జరిగిపోయాయి. అప్పుడు పార్టీలో రెండు చీలికలు వచ్చాయి. అయినప్పటికీ పళనిస్వామి సారథ్య వర్గానికే అధికారిక ఆమోదం ఉన్నది. తమ వర్గానికే సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం కూడా తమకు సానుకూల ప్రకటన చేసిందని పళనిస్వామి వివరించారు. ఆమెపై కేసు నమోదవడమే కాదు.. లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటామని తెలిపారు.

ఏఐఏడీఎంకే 50 వసంతాల వేడుకలను పురస్కరించుకుని MGR Memorial వద్ద శశికళ అక్టోబర్ 17వ తేదీన Party Flag ఆవిష్కరించారు. పార్టీ జెండాను కారుపై పెట్టుకుని ఆమె అక్కడికి వెళ్లారు. కాగా, పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో పళనిస్వామి, పనీర్‌సెల్వంలు ఈ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ జెండాను వినియోగించడంపై ఏఐఏడీఎంకే గుర్రుగా ఉన్నది. ఇప్పటికీ తానే పార్టీ కార్యదర్శి అన్నట్టుగా శశికళ వ్యవహరిస్తున్నారు. దీనిపై ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి జయ కుమార్ పోలీసులకు ఫిర్యాదు నిచ్చారు.

ఇప్పటి వరకు శశికళపై కొందరు ఏఐఏడీఎంకే నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, తాజాగా, సీనియర్ నేతలూ ఆమెపై ఆగ్రహిస్తున్నారు.

Also Read: మళ్లీ వస్తున్నా.. చిన్నమ్మ హింట్.. ‘ఆస్కార్ వస్తుందేమో కానీ.. పార్టీలో ప్లేస్ రాదు’

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ 2017లో అరెస్టయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్లు శిక్ష అనుభవించి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమె రాష్ట్రంలోకి వచ్చారు. ఆమె మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఎన్నికల కంటే ముందు రాజకీయాలపై తనదైన ముద్ర వేస్తారని అందరూ అనుకున్నారు. పార్టీ కుచించుకుపోవడాన్ని ఎంతమాత్రం సహించబోనని ఆమె ఓ ప్రకటన చేసి తన వైఖరిని స్పష్టం చేశారు. కానీ, అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే మిత్రపక్షం బీజేపీ నేతల వ్యూహంతో శశికళ ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనలేదు. అంతేకాదు, ఎన్నికలకు ముందే ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

కానీ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని చెబుతూ వస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలకు పార్టీ బలైపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారని ఆమె తరుచూ చెబుతున్నారు. ఆమె రాజకీయాల్లోకి రావడాన్ని ఏఐఏడీఎంకే నేత పనీర్‌సెల్వం సమర్థిస్తుండగా, పళనిస్వామి వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ చిన్నమ్మ, టీటీవీ దినకరణ్‌లు మళ్లీ పార్టీలోకి వస్తే తన స్థానానికే ముప్పు వస్తుందని పళనిస్వామి భయపడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.