కర్ణాటకలో బీజేపీకి మరో ఎదురు దెబ్బ.. పార్టీకి రాజీనామా చేసిన అరవింద్ చౌహాన్.. ఎందుకంటే ?
కర్ణాటక బీజేపీకి నాయకులు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. తమకు టిక్కెట్లు కేటాయించలేదనే కారణంతో పార్టీని వీడుతున్నారు. తాజాగా అరవింద్ చౌహాన్ అనే నాయకుడు బీజేపీకి రాజీనామా చేశారు.
కర్ణాటక ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలను కోల్పోయిన ఆ పార్టీకి.. తాజాగా మరో నాయకుడు రాజీనామా చేశారు. బీజేపీ కలబుర్గి జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి, జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు అరవింద్ చౌహాన్ బీజేపీని వీడుతున్నట్టు ప్రకటించారు. తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మరో సారి ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల బరిలో బీజేపీ.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు ఎందుకంటే ?
రాష్ట్రంలో అసెంబ్లీ పోరుకు ఇంకా 23 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ పలు విడతలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తోంది. ఇందులో టిక్కెట్లు రాని నేతలు ఒక్కక్కొరుగా పార్టీని వీడుతున్నారు. మొదటి విడత అభ్యర్థుల జాబితా విడుదల అయ్యాక అందులో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, సీనియర్ నాయకులకు చోటు దక్కలేదు. దీంతో వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాషాయ పార్టీకి రాజీనామా చేశారు.
తాజాగా సోమవారం బీజేపీ మూడో జాబితా విడుదల చేసింది. ఇందులో చోటు దక్కలేదనే కోపంతో తొలిసారిగా సీవీ చంద్రశేఖర్ అనే నాయకుడు రాజీనామా చేశారు. వెంటనే జేడీఎస్ లో చేరారు. ఆయన 2018 నుంచి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఎదురు చూస్తున్నారు. కానీ పార్టీ ఆయనకు టికెట్ కేటాయించకుండా చివరి నిమిషంలో ఎంపీ సంగన్న కరాడి కోడలు మంజుల అమరేష్ కరాడిని పోటీకి దింపింది.
ఇక మాఫియా ఎవరినీ భయపెట్టదు - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ఈ పరిణామం చోటు చేసుకున్న కొన్ని గంటల తరువాత అరవింద్ చౌహాన్ కూడా బీజేపీని వీడారు. ఆయన చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. తాజా జాబితాలో హైకమాండ్ ఆయన పేరును ప్రకటించకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారు. తరువాత పార్టీకి రాజీనామ చేశారు.
కాగా.. ఇప్పటి వరకు బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు మాజీ సీఎం జగదీష్ శెట్టర్, మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవది, మరో నేత అంగర ఎస్ పార్టీని వీడారు. ఇందులో శెట్టర్, సవది కాంగ్రెస్ చేరారు. ఇక బీజేపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పార్టీని వీడిన అంగర ఎస్..తాను రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇకపై తాను బీజేపీ తరఫున కూడా ప్రచారం చేయబోనని చెప్పారు.
కర్ణాటకలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రాకుండా ఎవరూ అడ్డుకోలేరు - యడియూరప్ప
కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మరోసారి అధికారం నిలుపుకోవాలని బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇక, కర్ణాకటలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13న వెలువడనుంది. మే 10న పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు మే 13న చేపట్టనున్నారు.