సారాంశం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోకి తన కుమారుడు అనిల్ ఆంటోనీ చేరిక గురించి తనకు ముందే తెలుసని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ అన్నారు. అనిల్ ఆంటోనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోకి తన కుమారుడు అనిల్ ఆంటోనీ చేరిక గురించి తనకు ముందే తెలుసని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ భార్య ఎలిజబెత్ అన్నారు. కాంగ్రెస్‌లో భవిష్యత్తు లేదని భావించి తమ కుమారుడు బీజేపీలోకి వెళ్లిపోయారని ఎలిజబెత్ చెప్పారు. అనిల్ పార్టీలో చేరిన తర్వాత బీజేపీపై తనకున్న కోపం తగ్గిపోయిందని, ప్రస్తుతం తన కుమారుడు ఆయన స్థానంలో సంతోషంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు. బీజేపీలో చేరిన తర్వాత అనిల్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆంటోనీ సౌమ్యంగా ప్రవర్తించారని, ఆయన ప్రశాంతంగా ఉండేవారని ఎలిజబెత్ గుర్తు చేసుకున్నారు.
"అనిల్ రాజకీయ నాయకుడు కావాలనుకున్నాడు. వంశపారంపర్య రాజకీయాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడంతో, అతని (ఆంటోని) పిల్లలు రాజకీయాల్లోకి రాలేరని స్పష్టమైంది. అనిల్ ఎన్నో ఉద్యోగాలు సంపాదించాడు. అయితే, ఆయన తన అభిరుచిని కొనసాగించడానికి అన్నింటినీ వదులుకున్నాడు. కానీ.. ఆంటోనీ అతనికి సహాయం చేయలేడు. ఉన్నత డిగ్రీ ఉన్నప్పటికీ, 39 ఏళ్ల వయస్సులో కూడా అతని రాజకీయ జీవితం ముందుకు సాగడం లేదు, కాబట్టి నేను అతని కోసం భగవంతుణ్ణి ప్రార్థించాను ” అని ఎలిజబెత్ పేర్కొన్నారు.
కేరళలోని అలప్పుజా క్యాథలిక్ డియోసెస్ నిర్వహిస్తున్న క్రిస్టియన్ రిట్రీట్ సెంటర్ క్రూపాసనం మరియన్ పుణ్యక్షేత్రంలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఎలిజబెత్ ఈ ప్రకటన చేశారు. ఆమె ప్రసంగానికి సంబంధించిన వీడియోను తమ యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేశారు.
'నేను సెయింట్ మేరీని ప్రార్థించాను. ఏడుస్తూనే సెయింట్ మేరీ ముందు నా 39 ఏళ్ల కొడుకు కలను తీసుకొచ్చాను. ఆ తర్వాత బీజేపీలో చేరాల్సిందిగా ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఆయనకు బీజేపీ అవకాశాలు అందిస్తుందని సమాచారం. నా ప్రార్థనలలో మేరీ తన విధికి ఒక మార్గాన్ని తెరవమని అడిగాను. బీజేపీ పట్ల నా ధిక్కారం, అసహ్యం పోయాయి. మేరీకి కృతజ్ఞతలు తెలుపుతూ నేను కొత్త హృదయాన్ని పొందాను" అని ఆమె పేర్కొన్నారు.
తన సుధీర్ఘ రాజకీయ జీవితాన్ని వదులుకోవాలని ఆంటోనీ నిర్ణయించుకున్నప్పటికీ, ఆమె ప్రార్థనలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కొనసాగడానికి సహాయపడ్డాయని ఎలిజబెత్ చెప్పారు. అనిల్ ఆంటోనీ ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీపై వివాదాస్పదమైన బిబిసి డాక్యుమెంటరీని విమర్శిస్తూ తన ట్విటర్ పోస్ట్ తర్వాత అనిల్ ఈ ఏడాది జనవరిలో కాంగ్రెస్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ కేరళ యూనిట్ డిజిటల్ కమ్యూనికేషన్స్‌ను ఆయనే నిర్వహించారు. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన డాక్యుమెంటరీని రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శిస్తామని కాంగ్రెస్ పార్టీ కేరళ యూనిట్ ప్రకటించిన సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.