ఉక్కు మహిళ, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో పాటు పలు రాజకీయ పార్టీలు ఆమెకు నివాళులర్పించాయి. అయితే అదే రోజున ఆమె జన్మించిన ఇంటికి సంబంధించి ఇంటిపన్ను నోటీసులు వెళ్లాయి.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న నెహ్రూ పూర్వీకుల బంగ్లా ‘ఆనంద్ భవన్‌’లో ఇందిరా గాంధీ జన్మించారు. అయితే ఈ ఇంటికి రూ.4.35 కోట్ల మేరకు పన్ను బకాయి ఉందని దీనిని చెల్లించాలని నోటీసులు వెళ్లాయి.

Also Read:వైసీపీ కీలక నేతతో వల్లభనేని వంశీ భేటీ.

ఈ ఇంటిని ప్రయాగ్‌రాజ్ నగరపాలక సంస్థ నివాసం లేని భవనాల కేటగిరీలో చేర్చింది. 2013 నుంచి ఆనందభవన్‌కు పన్ను చెల్లించలేదని కార్పోరేషన్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దీని బాగోగులను సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడుస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ ట్రస్ట్ చూసుకుంటోంది.

ఈ వ్యవహారంపై మున్సిపల్ కార్పోరేషన్ ట్యాక్స్ అసెస్‌మెంట్ ఆఫీసర్ పీకే మిశ్రా మాట్లాడుతూ.. నగరపాలక సంస్థ, ఆస్తి పన్ను నిబంధనల ప్రకారం ఆనంద్ భవన్‌కు నోటీసులు జారీ చేశామని.. దీనిపై తాము సర్వే చేసి ఎంత పన్ను బకాయి ఉందో నిర్ణయించామన్నారు.

Also Read:వల్లభనేని వంశీపై మాట్లాడబోను: యార్లగడ్డ వెంకట్రావు

ఒకవేళ తమ సర్వేపై అభ్యంతరాలు ఉంటే చెప్పాల్సిందిగా ప్రకటన కూడా చేశామని కానీ దీనిపై ఎవరూ స్పందించలేదని మిశ్రా తెలిపారు. అందువల్లే ఆనంద్‌భవన్‌కు నోటీసులు పంపించామని ఆయన వెల్లడించారు.

అయితే ఈ నోటీసులపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ట్యాక్స్ అసెస్‌మెంట్ అధికారుల తీరును ఆ పార్టీకి చెందిన ప్రయాగ్‌రాజ్ మాజీ మేయర్ ఖండించారు. జవహర్‌లాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే అన్నింటికి పన్ను మినహాయింపు ఉందని.. అయినప్పటికీ నోటీసులు ఇవ్వడంలో అర్ధమేంటని ఆయన ప్రశ్నించారు.