గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం ఉదయం వైసీపీ కీలకనేత ఒకరితో భేటీ అయ్యారు.  కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేత, వైసీపీ పొలిటికల్ కమిటీ సభ్యుడు దుట్టా రామచంద్రరావుతో ఆయన చర్చలు జరిపారు.

బుధవారం ఉదయం వంశీ దుట్టా ఇంటికి వెళ్లి మరీ పలు విషయాలపై చర్చలు జరపడం గమనార్హం. ఇటీవల వంశీ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా... అప్పటి నుంచి ఆయన వైసీపీలో చేరనున్నారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పార్టీలో చేరిక మొదలుకుని ఉపఎన్నికలు వస్తే పరిస్థితేంటి..? అనే దానిపై ఇద్దరి మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. మరో రెండు, మూడు రోజుల్లో వంశీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని వంశీనే స్వయంగా ప్రకటించారు. వంశీ కనుక వైసీపీ తీర్థం తీసుకుంటే... ఆ పార్టీ నేత యార్లగడ్డకి ఎర్త్ పడే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది.

ఈ నేపథ్యంలోనే  కాగా గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు మీడియా మీట్ నిర్వహించారు.తనతో వంశీ అసలు మాట్లాడలేదని.. ఏది జరిగినా తాను తన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని తేల్చి చెప్పారు. అయితే యార్లగడ్డ ప్రెస్ మీట్‌కు ముందు వైసీపీ కీలకనేత, వైఎస్‌కు అత్యంత ఆప్తుడు అయిన దుట్టాతో వంశీ భేటీ కావడం చర్చనీయాంశమైంది.

AlsoRead వల్లభనేని వంశీపై మాట్లాడబోను: యార్లగడ్డ వెంకట్రావు...
 
మరోవైపు.. యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్సీ పదవి ఖాయమైనట్లు వార్తలు వస్తున్నాయి. సోమవారం మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలతో కలిసి వెంకట్రావు సీఎం జగన్‌ను ఆయన నివాసంలో కలిసి.. వంశీ చేరికతో నియోజకవర్గంలో వెంకట్రావు పరిస్థితి ఏమిటన్న దానిపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే. వెంకట్రావుకు న్యాయం చేసే విషయం తాను చూసుకుంటానని, ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చినట్టు సమాచారం.