New Delhi: దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను భారత్ కు తీసుకొస్తున్నారు. ఇందుకోసం భారత వైమానిక దళానికి చెందిన సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానం బయలుదేరింది. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో ఈ  చిరుతలను విడుదల చేయనున్నారు. 

IAF’s aircraft departs to bring 12 cheetahs from Africa: ఆఫ్రికాను నుంచి 12 చిరుత‌ల‌ను భార‌త్ కు తీసుకురానున్నారు. వీటిని మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని కూనో నేష‌న‌ల్ పార్కులో ఉంచ‌నున్నారు. ఇప్ప‌టికే దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను తీసుకురావ‌డానికి భార‌త వైమానిక ద‌ళానికి చెందిన సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానం అక్క‌డ‌కు బయలుదేరింది. 

వివ‌రాల్లోకెళ్తే.. దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను భారత్ కు తీసుకొస్తున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. ఈ 12 చిరుత‌ల‌లో ఏడు మ‌గ‌వి కాగా, ఐదు ఆడ‌వి ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ఫిబ్రవరి 18న చిరుతలు భారత్ లో అడుగుపెట్టనున్నాయి. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో వీటిని విడుదల చేయనున్నారు. ఇదివ‌ర‌కు, 2022 సెప్టెంబర్ 17న ఆఫ్రికా దేశమైన నమీబియా నుంచి 8 చిరుతలను తీసుకొచ్చారు.

నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతలన్నీ కునో నేషనల్ పార్క్ పరిసరాలకు బాగా అలవాటు పడ్డాయని డీజీ వైల్డ్ లైఫ్ ఎస్పీ యాదవ్ తెలిపారు. సాసా అనే చిరుత తప్ప అన్ని చిరుతలు బాగానే ఉన్నాయి. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానం గురువారం ఉదయం హిందాన్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరింది. చిరుతలను తీసుకురావడానికి వైమానిక దళం ఎటువంటి ఛార్జీలను తీసుకోవ‌డం లేద‌ని స‌మాచారం. ఈ చిరుతలు ఫిబ్రవరి 18న భారత్ కు రానున్నాయి. వీటిని కునో నేషనల్ పార్క్ వద్ద కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేస్తార‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి. 

భారత వైమానిక దళానికి చెందిన సీ -17 గ్లోబ్ మాస్ట‌ర్ రవాణా విమానం గురువారం ఉదయం దక్షిణాఫ్రికా నుండి 12 చిరుతలను తీసుకురావడానికి భారతదేశం నుండి బయలుదేరిందని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారి ఒక‌రు తెలిపారు. ఫిబ్రవరి 18న ఆ చిరుతలు భార‌త్ చేరుకుంటాయ‌ని వెల్ల‌డించారు. దక్షిణాఫ్రికా నుంచి తీసుకువ‌స్తున్న 12 చిరుతల కోసం మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో 10 క్వారంటైన్ ఎన్ క్లోజర్లను ఏర్పాటు చేసినట్లు పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ.. "ఈ నెల‌ 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను భార‌త్ తీసుకురానున్నారు. ప్రస్తుతం ఇక్క‌డున్న చిరుతలు ఆరోగ్యంగా ఉన్నాయి. వాటిని బాగా చూసుకుంటున్నాం. దీనికి సంబంధించి గురువారం ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశాను" అని తెలిపారు. కునో నేషనల్ పార్కులో ప్రస్తుతం నమీబియా నుంచి తీసుకువచ్చిన ఎనిమిది చిరుతలు ఉన్నాయని తెలిపిన అధికారులు.. ప్రతి మూడు-నాలుగు రోజులకు ఒకసారి ఈ చిరుతలు వేటాడుతున్నాయ‌న్నారు. అన్నింటి ఆరోగ్యం బాగానే ఉందన్నారు. అయితే, క్రియేటినిన్ స్థాయిలు పెరగడంతో సాసా ఒక్క అనే చిరుత మాత్రం అనారోగ్యానికి గురైందని తెలిపారు. చికిత్స అనంతరం అదికూడా కోలుకుంటున్న‌ద‌న్నారు. 

చిరుతలను తీసుకురావడానికి దక్షిణాఫ్రికా, భారత్ జనవరిలో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనిలో భాగంగా భార‌త్ కు చిరుత‌లను తీసుకువ‌స్తున్నారు. దక్షిణాఫ్రికా, నమీబియా, బోత్సువానాలో 7,000కు పైగా చిరుతలు ఉన్నాయి. నమీబియాలో ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో చిరుతలు ఉన్నాయి. 1948 నాటికి భారత్ లో చిరుతలు అంతరించిపోయాయి. అంత‌కుముందు భారతదేశంలో చిరుతలు మంచి సంఖ్యలో ఉండేవి, కానీ ఎక్కువ వేట కారణంగా, అవి లేకుండాపోయాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. భారత్ లో మళ్లీ చిరుతలను పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రాజెక్టు చీతాను చేప‌ట్టింది.