మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ చిక్కుల్లో పడ్డారు. ప్రధాని నరేంద్రమోదీ ని పొగడాలనే ఆత్రంలో ఆమె చేసిన పొరపాటుని నెటిజన్లు ఎత్తి చూపిస్తున్నారు. మోదీని విమర్శిస్తూనే సీఎం భార్యకు చురకలు అంటించారు. ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు.

ఇంతకీ మ్యాటరేంటంటే....  ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం 69వ పుట్టిన రోజు జరుపుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఆయనకు సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వారిలో అమృత ఫడ్నవీస్ కూడా ఉన్నారు. అయితే... ఆమె తన ట్వీట్ లో ప్రధాని మోదీని  దేశానికే తండ్రి అంటూ సంబోధించారు.

‘‘మన దేశానికి తండ్రి లాంటివారైన ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దేశాన్ని ముందుకు నడిపించడం కోసం నిరంతరం శ్రమిస్తూ అందరిలో చైతన్యం నింపే వ్యక్తి మీరు’’ అంటూ అమృత తన దైన శైలిలో మోదీకి విషెస్ తెలియజేశారు.

అయితే... ఆమె మోదీని..‘‘ ఫాదర్ ఆఫ్ కంట్రీ’’ అని సంభోధించడం పట్ల వ్యతిరేకత మొదలైంది. నిజానికి మహాత్మాగాంధీని నేషన్ ఆఫ్ ఫాదర్ అని పిలుస్తాం. కాగా... మహాత్మా గాంధీతో మోదీ పోలుస్తారా అంటూ మండిపడ్డారు. అసలు ఏవిధంగా ఆయన దేశానికి తండ్రి అయ్యారంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు మోదీ దేశానికి ఏం చేశారంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. దేశంలో ఓ వైపు నిరుద్యోగం పెరిగిపోతుంటే... ఆయన ఏం చేశారని అమృతపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి వారి కామెంట్లకు ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి.