న్యూఢిల్లీ: ఆంపన్ అతి తీవ్ర తుఫాన్ సూపర్ సైక్లోన్ గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్టైంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అంపన్ అతి తీవ్ర తుఫాన్ గా కొనసాగుతోంది. ప్రస్తుతం పారాదీప్ కు దక్షిణంగా 780 కి.మీ దూరంలో బెంగాల్ లోని దిఘాకు930 కి.మీ దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమైంది.

సోమవారం నాడు సాయంత్రానికి ఈ తుఫాన్ సూపర్ సైక్లోన్ గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖాధికారులు తెలిపారు.సూపర్ సైక్లోన్ ప్రభావంతో సుమారు 200 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

also read:తమిళనాడుపై విరుచుకుపడ్డ ఎంఫాను తుఫాను... భారీ వర్షాలతో అతలాకుతలం

కోస్టల్ ఒడిశాలో, బెంగాల్ రాష్ట్రంలోన కోస్టల్ ప్రాంతంలో భారీ  వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సూపర్ సైక్లోన్ బుధవారం నాడు స్వల్పంగా శక్తిని కోల్పోయి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు 180-190 కి.మీ. వేగంతో అత్యంత తీవ్రమైన తుఫాన్ గా తీరం దాటే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఈ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలతో పాటు సిక్కింలో కూడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఏపీ రాష్ట్రంలోని కోస్తాంధ్రలో కూడ మోస్తారు నుండి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.అంపన్ తుఫాన్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం కూడ సన్నద్దమైంది. ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.