చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన ఎంఫాన్ తుఫాను తాజాగా అతి తీవ్రరూపం దాల్చింది. దీని ప్రభావంతో దక్షిణ తమిళనాడులో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈరోడ్,సేలం, ధర్మపురి, కోయిఅంబత్తూర్, క్రిష్ణగిరి జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

ఈదురు గాలుల వేగానికి అక్కడక్కడ హోర్డింగ్స్, చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల కరెంటు స్థంబాలు నేలకొరిగాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగి అందకారంగా మారాయి. సేలం, ధర్మపురి, క్రిష్ణగిరి జిల్లాలో ఇకపై కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని... ఆ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఎంఫాన్ తుఫాను క్రమంగా బలపడుతూ పెను తుఫానుగా మారుతోంది. ఈ తుఫాను నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి ఈశాన్య దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. 

తుఫాను కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులను మత్స్యకారులను హెచ్చరించారు. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ఓడరేవుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేసారు. 

ప్రస్తుతం ఈ తుఫాను పారాదీప్ దక్షిణ దిశగా 820 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్ లోని దిగా ప్రాంతానికి దక్షిణ నైరుతి దిసగా 980 కిలోమీటర్లు, బంగ్లాదేశ్ లోని కెఫాపుర ప్రాంతానికి దక్షిణ నైరుతి దిశగా 1090 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 

ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య క్రమంగా బలహీనపడుతూ తుఫాను తీరందాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ లపై ఈ తుఫాను ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.