Telangana Formation Day: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. దేశ రాజధాని ఢిల్లీలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరుకానున్నారు. తెలంగాణ రాష్ట్రం అధికారికంగా జూన్ 2, 2014న ఏర్పడింది.
Telangana Formation Day celebrations: ఢిల్లీలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అమిత్ షా హాజరుకానున్నారు. దేశరాజధాని ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జూన్ 2న హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ “తెలంగాణ అవతరణ దినోత్సవం” వేడుకలను నిర్వహించనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎన్నో పోరాటాలు, ఎంతో మంది ప్రాణ త్యాగాలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి.. తెలంగాణ రాష్ట్రం అధికారికంగా జూన్ 2, 2014న ఏర్పడింది. ఆ రోజును 'తెలంగాణ దినోత్సవం' లేదా 'తెలంగాణ అవతరణ దినోత్సవం'గా జరుపుకుంటారు. ఈ ఈవెంట్‌ని నేషనల్ ఇంప్లిమెంటేషన్ కమిటీ (NIC) ఆమోదించింది.
ఈ సంవత్సరం ఎనిమిదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశపు అతి పిన్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర సంస్కృతి, వారసత్వం, నిర్మాణ వైభవం, తెలంగాణ హీరోల భూమి మూలాలను హైలైట్ చేయడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది. కార్యక్రమంలో భాగంగా తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకులు మంగళి, వేదాల హేమచంద్ర సంగీత విభావరి చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద జత రాష్ట్రమైన హర్యానాలోని పాఠశాల పిల్లల ప్రదర్శనలు కూడా ఉంటాయి. తెలంగాణకు చెందిన జానపద నృత్యకారులు మరియు కథక్ కేంద్రం ఢిల్లీ వారి ప్రదర్శనలు కూడా రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తాయి.
భారత ప్రభుత్వం "తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం" జరుపుకోవడం ఇదే మొదటిసారి మరియు దానిని సముచితమైన రీతిలో జరుపుకునేలా చూసేందుకు, ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖల మంత్రి మీనాకాశీ లేఖి కూడా హాజరుకానున్నారు. అలాగే, పెద్ద సంఖ్యలో తెగులు ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని సమాచారం.
ఇదిలావుండగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అయిన ఇప్పటివరకు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను జరపలేదు. కానీ సారి జరుపుతుండటానికి రాబోయే ఎన్నికలే కారణమని తెలంగాణ రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. తెలంగాణపై అంత ప్రేమ ఉంటే రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, కేంద్ర సంస్థల ఏర్పాటు విషయంలో చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఇతర బీజేపీ నాయకులు తెలంగాణలో పర్యటించినప్పుడు అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో రాష్ట్రంలో బీజేపీ-టీఆర్ఎస్ ల మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.
కాగా, మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదికైన పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్‌ను సమీక్షించారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్‌లో సీఎంరావు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. కేసీఆర్ పాలనకు ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పనితీరు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపడుతున్న ప్రాజెక్టుల స్థితిగతులను ఎత్తిచూపేందుకు 172 పేజీల సుదీర్ఘ ప్రగతి నివేదికను సిద్ధం చేసింది. రాష్ట్ర మంత్రులకు జిల్లాల వారీగా నివేదికలను సంబంధిత జిల్లాల ప్రజలకు తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు.
