కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే స్కామ్‌లు, అవినీతికి  భారత దేశం తలమానికంగా మారుతుందని, నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే మోసగాళ్లు కటకటాలపాలవుతారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకపడ్డారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే స్కామ్‌లు, అవినీతికి అడ్డుఅదుపు ఉండని అన్నారు. అదే నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే.. మోసగాళ్లు కటకటాల వెనక్కి వెళ్తారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. దీంతో పాటు రాజస్థాన్‌లోని గెహ్లాట్ ప్రభుత్వం అవినీతిలో నంబర్‌వన్‌గా ఉందని ఆరోపించారు. రాజస్థాన్‌లో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అమిత్ షా అన్నారు. దీంతో పాటు నరేంద్ర మోదీ మరోసారి దేశానికి ప్రధాని అవుతారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తాము 300 సీట్లు గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ..ఈ తొమ్మిదేళ్లు భారతదేశంలో అనేక విధివిధానాలు మారాయనీ, పలు రంగాల్లో ప్రగతి పథంలో దూసుకెళ్తుందని అన్నారు. 

రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే సోనియా గాంధీ లక్ష్యమని, తన కుమారుడు తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి చేయడమే లాలూ యాదవ్ లక్ష్యమని హోంమంత్రి అన్నారు. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్‌ను ముఖ్యమంత్రిని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే విధంగా అశోక్ గెహ్లాట్ తన కుమారుడు వైభవ్ గెహ్లాట్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకుంటున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే స్కామ్‌లు, అవినీతి భారత దేశానికే తలమానికంగా మారుతుందని, నరేంద్రమోడీ మళ్లీ ప్రధాని అయితే మోసగాళ్లు కటకటాల వెనక్కి వెళ్తారని అన్నారు.

అదే సమయంలో మంత్రి అమిత్ షా గెహ్లాట్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, కన్హయ్యాలాల్ హత్య కేసులో దోషులకు శిక్ష ఆలస్యం కావడానికి కాంగ్రెసే కారణమని ఆరోపించారు. గతేడాది జూన్ 28న కన్హయ్యలాల్ హత్యకు గురయ్యారు. నూపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ చేసిన తర్వాత అతన్ని మతోన్మాది హత్య చేశారు. అలాగే.. గెహ్లాట్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టిందని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని గెహ్లాట్ ప్రభుత్వంపై అమిత్ షా దాడి చేశారు. 19కి పైగా రిక్రూట్‌మెంట్ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయని, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి కుమారుడు పరీక్షలో టాపర్‌గా నిలిచారని ఆయన పేర్కొన్నారు.