ఆర్టికల్ 370తో ఆర్టికల్ 371ను పోల్చవద్దని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఈశాన్య రాష్ట్రాలు భయపడాల్సిన అవసరం లేదని కూడా అన్నారు. జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటుకు వివరణ ఇస్తూ ఆయన ఆ విధంగా అన్నారు.

హోంమంత్రి అమిత్ షా పార్లమెంటుకు వివరణ ఇస్తూ, 11 రాష్ట్రాలకు  ప్రత్యేక అధికారాలను ఇచ్చే ఆర్టికల్ 371ఏ ను రద్దు చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని తెలిపారు. 370 ఆర్టికల్ ను రద్దు చేసిన మీరు ఆర్టికల్ 371ని రద్దు చేయరన్న గ్యారంటీ ఏంటి అనే కాంగ్రెస్ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆయన ఈ విధంగా అన్నారు. ఈ స్థితిలో ఆర్టికల్ 371లో పొందుపరిచిన అంశాలేమిటనే ఆసక్తి చోటు చేసుకుంది.  

ఆర్టికల్ 370, 371లు రాజ్యాంగం అమల్లోకొచ్చిన నాటి నుంచి రాజ్యాంగంలో అంతర్భాగాలే. ఆర్టికల్ 371ఏ నుంచి 371జె మాత్రం తరువాతి కాలంలో అవసరానికి తగ్గట్టుగా ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు, రక్షణలు కల్పించాల్సి వచ్చినప్పుడు సమయానుకూలంగా ఇవ్వడం వల్ల వాటిని రాజ్యాంగంలో పొందుపరిచారు. ఏ ఏ ఆర్టికల్స్ కింద ఏ ఏ రాష్ట్రాలకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించారో చూద్దాం. 

ఆర్టికల్ 371: దీని ప్రకారంగా మహారాష్ట్ర లోని మరాఠ్వాడ, విదర్భలకు ప్రత్యేక బోర్డులు, మిగిలిన ప్రాంతాలన్నిటికి కలిపి ఒక అభివృద్ధి బోర్డు, గుజరాత్ లోని సౌరాష్ట్ర, కచ్ లకు ప్రత్యేక అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయవలిసి ఉంటుంది. ఈ ప్రాంతాలకు హక్కుగా  అందవలిసిన నిధులను ఆ ప్రాంతాలకే కేటాయించడం కోసం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా ఈ ప్రాంతవాసులకు రిజర్వేషన్ లు కల్పించడం కోసం ఈ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా రాష్ట్రాల గవర్నర్ లకు ఇది ప్రత్యేక బాధ్యతగా అప్పగించడం జరిగింది.  

ఆర్టికల్ 371ఏ: 1962లో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా నాగాలాండ్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులను కల్పిస్తుంది ఈ ఆర్టికల్. నాగాలాండ్ లో నివసించే నాగా ప్రజల మతవిశ్వాసాల పైన కానీ, సామాజిక కట్టుబాట్లపైన కానీ, ఆచార వ్యవహార విషయాల్లోకాని, భూముల పై అధికారం విషయాల్లోకాని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలను తీసుకోలేదు. 

ఆర్టికల్ 371బి: 1969లో 22వ రాజ్యాంగ సవరణ ద్వారా  అస్సాం రాష్ట్రానికి ప్రత్యేక హక్కులను కల్పిస్తుంది ఈ ఆర్టికల్. ఆ రాష్ట్ర అసెంబ్లీకి చెందిన గిరిజన ప్రాంత ఎం ఎల్ ఏ లతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయమని సూచిస్తుంది. 

ఆర్టికల్ 371సి: 1971లో 27వ రాజ్యాంగ సవరణ ద్వారా  మణిపూర్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులను కల్పిస్తుంది ఈ ఆర్టికల్. ఆ రాష్ట్ర అసెంబ్లీలో కొండ ప్రాంతానికి చెందిన ఎం ఎల్ ఏ లతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయమని సూచిస్తుంది. 

ఆర్టికల్ 371డి: ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలకు, కాలేజీల్లో సీట్ల విషయంలో రేజర్వేషన్లకు సంబంధించింది. టూకీగా మన జోనల్ వ్యవస్థ. 

ఆర్టికల్ 371ఇ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీ ఏర్పాటు. 

ఆర్టికల్ 371ఎఫ్ : 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక హక్కులను కల్పిస్తుంది ఈ ఆర్టికల్. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఖచ్చితంగా అన్ని ప్రాంత ప్రజలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఇందుకుతగ్గ విధంగా అసెంబ్లీలో సీట్ల సంఖ్య ఉండాలి. 

ఆర్టికల్ 371జి : 1986లో 53వ రాజ్యాంగ సవరణ ద్వారా మిజోరాం రాష్ట్రానికి ప్రత్యేక హక్కులను కల్పిస్తుంది ఈ ఆర్టికల్. మిజోరాంలో నివసించే మిజో  ప్రజల మతవిశ్వాసాల పైన కానీ, సామాజిక కట్టుబాట్లపైన కానీ, ఆచార వ్యవహార విషయాల్లోకాని, భూముల పై అధికారం విషయాల్లోకాని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలను తీసుకోలేదు. 

ఆర్టికల్ 371హెచ్ : 1986లో 55వ రాజ్యాంగ సవరణ ద్వారా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులను కల్పిస్తుంది ఈ ఆర్టికల్. అక్కడ శాంతి భద్రతల విషయంలో ఆ రాష్ట్ర గవర్నర్ కు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరిగింది. 

ఆర్టికల్ 371జె  : 2012లో 98వ రాజ్యాంగ సవరణ ద్వారా కర్ణాటకలోని హైదరాబాద్-కర్ణాటక ప్రాంతానికి ప్రత్యేక హక్కులను కల్పిస్తుంది ఈ ఆర్టికల్. ఇంతకు ముందు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉండి రాష్ట్రాల విభజనానంతరం కర్ణాట రాష్ట్రంలో కలిసిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఒక బోర్డును ఏర్పాటు చేయవలిసిందిగా చెబుతుంది ఈ ఆర్టికల్. విద్యా, ఉద్యోగాల్లో ఈ ప్రాంతం వారికి రేజర్వేషన్లు కల్పించాలని కూడా పేర్కొంటుంది.