Bengaluru: కాంగ్రెస్ వంశపారంపర్య పార్టీ అనీ, అవినీతిలో నెంబర్ వన్ అంటూ కేంద్ర హోం మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు అవినీతిలో అగ్రస్థానంలో ఉన్నాయనీ, వారి కుటుంబ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాయని విమర్శించారు.
Amit Shah slams Congress : కాంగ్రెస్, జేడీఎస్ లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతిలో అగ్రస్థానంలో ఉంటూ, తమ కుటుంబ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాయనీ, ఆ రెండు పార్టీలను కుటుంబ వారసత్వ పార్టీలుగా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ తన సీనియర్ నాయకులను, అనుభవజ్ఞులను అవమానిస్తోందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను ప్రధాని నరేంద్ర మోడీ ఆయన జన్మదినం సందర్భంగా సన్మానించిన తీరును చూసి అలాంటి నాయకులతో ఎలా వ్యవహరించాలో అన్ని రాజకీయ పార్టీలు నేర్చుకోవాలని ఆయన హితవుపలికారు.
వివరాల్లోకెళ్తే.. కొన్ని నెలల్లో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి అధికార పీఠం దక్కించుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. మే నెలలో జరగనున్న ఎన్నికలకు ముందు బీజేపీ రాష్ట్రవ్యాప్త 'విజయ్ సంకల్ప యాత్ర'లో భాగంగా బెంగళూరు సమీపంలోని బీదర్, దేవనహళ్లిలో జరిగిన రెండు బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగించారు. ఎఫ్డీఐ మిత్రపక్షమైన బీజేపీకి ఓటు వేయాలా లేక అవినీతిలో నంబర్ వన్ గా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ లకు ఓటు వేయాలా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలని అన్నారు. విమానయానం, అంతరిక్ష రంగాల్లో కర్ణాటకను నంబర్ వన్ గా నిలిపిన బీజేపీ కావాలా? లేక తమ కుటుంబ ప్రయోజనాల కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చే కాంగ్రెస్, జేడీఎస్ కావాలా? అని ప్రశ్నించారు.
స్టార్టప్స్, యూనికార్న్ లలో కర్ణాటకను నెంబర్ వన్ గా నిలిపిన బీజేపీకి ఓటు వేస్తారా? లేక తమ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ టికెట్లు ఇస్తున్న జేడీఎస్ కు ఓటు వేస్తారా? అని ప్రచార ర్యాలీలో పాలుపంచుకున్న ప్రజలను ప్రశ్నించారు. అలాగే, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు తెరలేపిందనే ఆరోపణల ఎదుర్కొంటున్న సంస్థలను గురించి కూడా షా ప్రస్తావించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను, దాని అనుబంధ సంస్థలను నిషేధించిన బీజేపీకి ఓటు వేస్తారా? లేక ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఉగ్రవాదులకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ కు ఓటు వేస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. తమ కుటుంబాలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీలు కర్ణాటకకు మేలు చేయలేవనీ, కుటుంబ ప్రయోజనాలకు అతీతంగా కర్ణాటకలోని పేదల సంక్షేమం గురించి ఆలోచించలేవని కాంగ్రెస్, జేడీఎస్ లపై విమర్శలు గుప్పించారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ మాత్రమే పేద ప్రజల గురించి ఆందోళనగా ఉందని అమిత్ షా పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. జేడీఎస్ కు వేసిన ప్రతి ఓటు చివరకు కాంగ్రెస్ కే వెళ్తుందని ఆరోపించారు. జేడీఎస్ కు ఓటేస్తే 25 నుంచి 30 సీట్లు వస్తే అవి కాంగ్రెస్ కు వెళ్తాయనీ, ఇదే జరిగితే కర్ణాటక నెంబర్ వన్ అవినీతి కాంగ్రెస్ పాలనలోకి వస్తుందని ఆరోపిస్తూ.. బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్ నిజలింగప్ప అయినా, మాజీ ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ అయినా కాంగ్రెస్ తమ నాయకులను అవమానించిందని అమిత్ షా అన్నారు. పార్టీ సీనియర్లతో హుందాగా ఎలా వ్యవహరించాలో బీజేపీకి మాత్రమే తెలుసని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోడీ ఇటీవల కర్ణాటకలో పర్యటించారనీ, ప్రజల ముందు యడ్యూరప్పను సన్మానించిన తీరు చూసి అన్ని రాజకీయ పార్టీలు నేర్చుకోవాలన్నారు. వృద్ధులు, దిగ్గజాలు, ప్రజాదరణ కలిగిన నాయకులను ఎలా గౌరవించాలో నేర్చుకోవాలంటూ హితవుపలికారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై విమర్శలు గుప్పించిన అమిత్ షా.. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కు ఏమైందని ప్రశ్నించారు. 'మోదీ తేరీ కబర్ ఖుదేగీ' అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 'మోదీ మార్ జా' (మోదీ చనిపోవాలి) అని నినదిస్తోంది. కానీ, ప్రధానికి ప్రజల ఆశీస్సులు ఉన్నందున ఇలాంటి నినాదాలు ఏం చేయాలేవని షా అన్నారు. ఎంత బురదజల్లినప్పటికీ కమలం (బీజేపీ పార్టీ గుర్తు) మరింత వికసిస్తుందని పేర్కొన్నారు.
