మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కర్ణాటకలో అధికారంలో వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ హామీలను ఆయన కొట్టిపారేశారు.

బెంగళూరు: మత ప్రాతిపదికన రిజర్వేషన్లను ఎప్పటికీ అనుమతించబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కర్ణాటకలో అధికారంలో వస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామన్న కాంగ్రెస్ హామీలను ఆయన కొట్టిపారేశారు. ఓట్లను పొందడానికి కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలను మళ్లీ మళ్లీ ప్రయోగిస్తుందని విమర్శించారు. ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్ షా ఈ కామెంట్స్ చేవారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయంగా లబ్ది పొందేందుకు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేసిందనే ఆరోపణలను అమిత్ షా ఖండించారు. ఈ నిర్ణయం తొందరపడి తీసుకున్నది కాదని స్పష్టం చేశారు. ‘‘ఈ నిర్ణయం తొందరపడి తీసుకోలేదు. ఈ నిర్ణయం చాలా ఆలస్యంగా తీసుకోబడింది. ఇది చాలా ముందుగానే తీసుకోవాలి. ఈ దేశ రాజ్యాంగం మత ప్రాతిపదికన రిజర్వేషన్లను గుర్తించలేదు. ఒకవేళ మత ప్రాతిపదికన మైనారిటీకి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి ఉంటే.. దానిని రద్దు చేయాలి. మేము దానిని చేశాం. అవును మేము నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేశాం. ఈ చర్యను ఒక సంవత్సరం క్రితమే చేపట్టాల్సింది’’ అని అమిత్ షా పేర్కొన్నారు. 

అయితే రిజర్వేషన్లను బీజేపీ రివర్స్ బుజ్జగింపుగా కొందరు పేర్కొనడంపై ప్రశ్నించినప్పుడు.. ‘‘చూడండి.. తీసుకోవడం లేదా ఇవ్వడం (రిజర్వేషన్)... రెండూ రాజ్యాంగం ప్రకారం ఉండాలి. దేశం రాజ్యాంగం ప్రకారం ముందుకు సాగాలని మనమందరం అంగీకరిస్తున్నాం. కాంగ్రెస్ నాయకులలో ఎవరైనా ఒకరు వచ్చి మన రాజ్యాంగంలోని మత ఆధారిత రిజర్వేషన్లు కల్పించే సెక్షన్‌ని నాకు చూపించమనండి. వారు అలా చేయలేకపోతే.. అప్పుడు మత ప్రతిపాదన రిజర్వేషన్లు ఎందుకు కల్పించారనే దానికి కారణాన్ని సమర్థించుకోవాలి. కాంగ్రెస్ పార్టీది బుజ్జగింపు’’ అని అమిత్ షా పేర్కొన్నారు. 

Also Read: కర్ణాటకలో పూర్తి మెజారిటీ సాధిస్తాం.. అలాంటి కాంగ్రెస్‌ను ఎవరు నమ్ముతారు?: ఏషియానెట్ ఇంటర్వ్యూలో అమిత్ షా

‘‘మేము రాజ్యంగం ప్రకారం వాటిని సరిదిద్దాం. ముస్లిం రిజర్వేషన్ రాజ్యాంగ విరుద్ధం. ముస్లింలలోని ఇతర వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు రావాలి.. మొత్తం ముస్లింలకు కాదు. ఇతర మతాలకు కూడా అదే వర్తిస్తుంది. ఏ కులం వెనుకబడి ఉంటే.. వారు దానిని (రిజర్వేషన్) పొందాలి. కానీ ముస్లింలకు లేదా హిందువులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడానికి... రేపు ఏదో ఒక ప్రభుత్వం వచ్చి హిందువులందరికీ రిజర్వేషన్లు కల్పిస్తే ఎలా ఉంటుంది? మీరు చేయగలరా? మీరు చేయలేరు! వారు ఈ రిజర్వేషన్లను ఎలా సృష్టించారని మీరు కాంగ్రెస్‌ను అడగాలి’’ అని అమిత్ షా అన్నారు. 

వొక్కలిగ, లింగాయత్ కమ్యూనిటీకి నాలుగు శాతం కోటాను తిరిగి కేటాయించడంపై అమిత్ షా స్పందిస్తూ.. ‘‘మీరు దీన్ని నిశితంగా అర్థం చేసుకోవాలి. ఈ మూడు ఒక బ్లాక్ (రిజర్వేషన్) గా ఏర్పడ్డాయి. నాలుగు శాతం ముస్లిం కోటా రద్దు చేయబడితే.. మిగిలిన రెండు ఆటోమేటిక్‌గా ఉంటాయి. ఒక్కొక్కటి రెండు శాతం పొందాయి. మేమే (బీజేపీ) ఎలాంటి రిజర్వేషన్లను పెంచలేదు. అది డిఫాల్ట్‌గా పెరిగింది’’ అని తెలిపారు. 

గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఇతర వెనుకబడిన కులాల 2B కేటగిరీలో 4 శాతం ముస్లిం కోటాను రద్దు చేసి.. వొక్కలిగాలు, లింగాయత్‌లకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో, ప్రవేశాలలో పెరిగిన కోటా ప్రయోజనాలను మంజూరు చేస్తూ బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సమర్థించుకుంది. 

ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 నుంచి 16 వరకు ఉన్న ఆదేశానికి విరుద్ధంగా ఉన్నందున కేవలం మత ప్రాతిపదికన రిజర్వేషన్‌ను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపింది.

కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్‌పై ఎందుకు ఆధారపడి ఉందన్న మరో ప్రశ్నకు అమిత్ షా సమాధానమిస్తూ.. ‘‘మేము ఆధారపడటం లేదు. సామాజిక న్యాయం నిర్ధారించే బాధ్యత ప్రభుత్వానికి లేదా? రిజర్వేషన్ల నిర్ణయాన్ని ఎన్నికల రంగం నుండి చూడవలసిన అవసరం ఏమిటి?. ఇది ప్రభుత్వ బాధ్యత. నిర్ణయం ఆలస్యంగా వచ్చిందని నేను అంగీకరిస్తున్నాను. ముస్లిం రిజర్వేషన్‌లను ఏడాది క్రితమే రద్దు చేసి ఉండాల్సింది. మనం ఆలస్యం అయ్యామంటే.. ఇంకా జాప్యం చేద్దామని కాదు’’ అని పేర్కొన్నారు.