Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో పూర్తి మెజారిటీ సాధిస్తాం.. అలాంటి కాంగ్రెస్‌ను ఎవరు నమ్ముతారు?: ఏషియానెట్ ఇంటర్వ్యూలో అమిత్ షా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో రాజకీయ వేడి పెరుగుతుంది. ఈ పరిస్థితుల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఏషియానెట్ సువర్ణ న్యూస్‌ ఎడిటర్ అజిత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్బ్యూలో కర్ణాటకలో బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Amit Shah with Asianet News says Who will believe the guarantee of party congress ksm
Author
First Published Apr 30, 2023, 9:20 PM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుంది. దీంతో ప్రధాన పార్టీలకు చెందిన అగ్రనేతలు సైతం ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ప్రచారం నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. మరోవైపు జేడీఎస్ కూడా ప్రచారాన్ని ముమ్మరంగా  కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే పార్టీల నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు.. విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతుంది. ఈ పరిస్థితుల వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఏషియానెట్ సువర్ణ న్యూస్‌ ఎడిటర్ అజిత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్బ్యూలో కర్ణాటకలో బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

గత రెండున్నర నెలల్లో కర్ణాటకలో 17 రోజులు ఉన్నానని.. దాదాపు రాష్ట్ర పర్యటన పూర్తి చేశానని అమిత్ షా తెలిపారు. ఈ సారి కర్ణాటకలో బీజేపీ పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ హయంలో తొమిదేళ్లలో దేశవ్యాప్తంగా లబ్దిదారులనే కులం పుట్టుకొచ్చిందని అన్నారు.  కర్ణాటకలో కూడా వివిధ వర్గాల ప్రజలు అనేక పథకాల ద్వారా లబ్దిపొందారని చెప్పారు. కర్ణాటకలో దాదాపు 3 కోట్ల మంది ప్రజలు ఒక్కొక్కరు నెలకు 5 కిలోల చొప్పున ధాన్యాన్ని ఉచితంగా పొందుతున్నారని తెలిపారు. ఈ 9 ఏళ్లలో బీజేపీ దేశంలోని చాలా కొత్త ప్రాంతాలను మళ్లీ మళ్లీ గెలుస్తూ వస్తోందని చెప్పారు. 

కర్ణాటకలో అభివృద్ది అనేది సమస్యా? అనే ప్రశ్నపై స్పందించిన అమిత్ షా.. చాలా సమస్యలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం  సాధించిన ఎన్నో విజయాల పట్ల ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అలాంటప్పుడు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేస్తారు? అని అన్నారు. జనతాదళ్(సెక్యూలర్) ప్రభుత్వం ఇక్కడ చాలాసార్లు అధికారం చేపట్టిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు సార్లు నిరంతరంగా ఉందని.. వారు ఏం చేశారని ప్రశ్నించారు. 

లింగాయత్ ఓటు బ్యాంకు టెన్షన్‌గా ఉందా? అనే ప్రశ్నకు స్పందించిన అమిత్ షా.. అలాంటిదేమి లేదని స్పష్టం చేశారు. లింగాయత్‌లకు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ 70 ఏళ్లలో ఇద్దరు లింగాయత్ ముఖ్యమంత్రులను మాత్రమే ఇచ్చి వారిని అవమానించిందని ఆరోపించారు. తమకు బసవరాజ్ బొమ్మై, యడియూరప్ప వంటి లింగాయత్ నాయకులు ఉన్నారని.. ఆ విషయంలో ఎలాంటి ఆందోళన లేదని తెలిపారు. పార్టీ నియమావళి ప్రకారం తాను పోటీకి దూరంగా ఉండనున్నట్టుగా యడ్యూరప్ప స్వయంగా తనకు చెప్పారని తెలిపారు. 

వాళ్లిద్దరూ ఓడిపోతారు.. 
పార్టీలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయని కార్మికులు వేల సంఖ్యలో ఉన్నారని.. వారే తమకు పెద్ద నాయకులని చెప్పారు. ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని కుషాభౌ ఠాక్రే తమ జాతీయ అధ్యక్షుడయ్యాడని గుర్తుచేశారు. లక్ష్మణ్ సావడి, జగదీష్ శెట్టర్‌లు 30,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో తమ సీటును కోల్పోతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ వారికి ఏం చేసిందో ప్రజలకు తెలుసునని అన్నారు. ఒక బీజేపీ కార్యకర్త‌కు భావజాలం ఉంటుందని.. స్వార్థపరులు కాకపోతే కాంగ్రెస్‌లో ఎలా చేరారనేది పెద్ద ప్రశ్న అని అన్నారు. 

శెట్టర్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయం తీసుకుందని ఆయనకు తానే చెప్పానని.. దానిని ఆయన జీర్ణించుకోలేకపోయాడని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లేదని విమర్శించారు. అందుకే బీజేపీ నుంచి బయటకు వెళ్లిన నేతలు వారితో కలుస్తుంటే.. గెలుస్తామని భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. తనపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఫిర్యాదుపై అమిత్ షా స్పందిస్తూ.. దేశంలో మతపరమైన కేసుల చరిత్రను పరిశీలిస్తే.. ఇలాంటి కేసులు 90 శాతం కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ గుజరాత్‌తో పాటు, ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలలో కూడా హామీల వర్షం కురిపించిందని.. అయితే ఇమేజ్ లేని పార్టీ హామీలను ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఇస్తున్న హామీల కంటే.. అంతకుమించిన ప్రయోజనాలు అక్కడి ప్రజలు పొందుతున్నారని చెప్పారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటారని తెలిపారు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న అవినీతి ఆరోపణలను అమిత్ షా ఖండించారు. ఏ కోర్టులోనైనా అవినీతి కేసు ఉంటే చెప్పాలన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కొడుకు లంచం తీసుకుంటూ పట్టుబడితే.. ఎన్నికల్లో టికెట్ కూడా ఇవ్వలేదని చెప్పారు. 

రిజర్వేషన్లపై..
రిజర్వేషన్లకు సంబంధించి అంశంపై మాట్లాడుతూ.. ఈ నిర్ణయం హడావిడిగా తీసుకోలేదని, నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం  జరిగిందని చెప్పారు. భారత రాజ్యాంగం మత ప్రాతిపదికన రిజర్వేషన్లను గుర్తించలేదని చెప్పారు. మైనారిటీకి మతం ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్ ఉంటే దానిని రద్దు చేశామని చెప్పారు. ఈ అంశం సుప్రీంకోర్టులో ఉంటే దానిని పరిశీలిస్తామని చెప్పారు. రిజర్వేషన్లు తీసుకోవడం, ఇవ్వడం రాజ్యాంగ ప్రాతిపదికన జరగాలని అన్నారు. తెలంగాణ విషయాని వస్తే.. అక్కడ కూడా రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్ గురించి ఆలోచిస్తామని చెప్పారు. ముస్లిం సమాజానికి ఓబీసీలలో రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. కేవలం ముస్లిం, హిందు అని చెప్పి రిజర్వేషన్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పులు ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇస్తున్న హామీలు కార్యరూపం దాల్చవని అన్నారు. 

మల్లికార్జున  ఖర్గే మాత్రమే కాకుండా కాంగ్రెస్ నాయకులందరూ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. చాలా తక్కువ స్థాయి భాషను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. గతంలో సోనియా, ప్రియాంకలు మోదీకి వ్యతిరేకంగా  మాట్లాడారని చేశారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పెద్ద వేడుక అని.. నరేంద్ర మోదీ దేశ ప్రధాని అని, ఎన్నికల సమయంలో దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చని అన్నారు. అయితే  కాంగ్రెస్ బహిరంగ సభ పెట్టలేని మన్మోహన్ సింగ్‌కు అలవాటు పడిందని ఎద్దేవా చేశారు. కర్ణాటకలోని నీటి  సమస్యపై స్పందిస్తూ.. రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీ ఆ సమస్యను ఎలా పరిష్కరించగలదు? అని ప్రశ్నించారు. జేడీ(ఎస్)కి ఓటేయడం అంటే కాంగ్రెస్‌కు ఓటేయడమేనని ప్రజలకు తెలుసునని అన్నారు. 

బెంగళూరు నగరం మినహా పాత మైసూరు, చుట్టుపక్కల జిల్లాల్లో బీజేపీ మెరుగైన పనితీరు ఎందుకు కనబరచడం లేదనే ప్రశ్నపై అమిత్ షా స్పందిస్తూ.. తాము కష్టపడి పనిచేస్తున్నామని చెప్పారు. అక్కడ సహజంగానే జేడీ(ఎస్), కాంగ్రెస్ మధ్య పోరు ఉండేదని.. అయితే ఈ నాలుగేళ్లలో బూత్ స్థాయిలో తమ పార్టీని మరింత బలోపేతం చేశామని చెప్పారు. ప్రధాని మోదీ కూడా అక్కడ ర్యాలీ నిర్వహించారని.. ఈసారి అక్కడ కూడా తమ సీట్లు పెరుగుతాయని ఆశిస్తున్నామని చెప్పారు. 

దేశ అంతర్గత భద్రతపై.. 
 ఏ సంస్థ అయినా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే తాము గుడ్డిగా కూర్చోలేమని స్పష్టం చేశారు. ‘‘ఉత్తర భారతదేశంలో హింస 70 శాతం తగ్గింది. 8,000 మంది ఆయుధాలతో లొంగిపోయారు. తొమ్మిది వేర్వేరు ఉగ్రవాద గ్రూపులు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం జరిగింది. కశ్మీర్‌లో కూడా హింస రేటు 6 శాతం మాత్రమే. రాళ్లదాడి ఘటనలు ఇప్పుడు జీరోగా మారాయి. నక్సల్స్ హింస 20 శాతం మాత్రమే. పంజాబ్‌లో కూడా ఏం జరిగినా అక్కడి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కఠిన చర్యలు తీసుకున్నాం. అంతర్గత భద్రతా విషయాలలో అద్భుతమైన మెరుగుదల ఉంది’’  అని అమిత్ షా చెప్పారు. 

జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోపణలపై స్పందిస్తూ.. ఆయన  పదవిలో ఉన్నప్పుడే ఈ వ్యాఖ్యలు చేస్తే అవి విశ్వసనీయతను కలిగి ఉండేవని అమిత్ షా అన్నారు. వారు ఆ సమయంలో ఏదైనా దేశ వ్యతిరేక పనిని చూసినట్లయితే.. ఆ సమయంలో ఎందుకు వ్యాఖ్యానించలేదు? అని ప్రశ్నించారు. ఇక, దేశ భద్రతకు సంబంధించి చాలా రాజకీయాలు జరుగుతాయని మీరు అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు.. మరి అలా అని కాదని అమిత్ షా చెప్పారు. వాస్తవ పరిస్థితులు దేశ ప్రజలకు బాగా తెలుసునని అన్నారు. ప్రధాని మోదీ తమ నాయకుడని.. తాము ఆయన నుంచి కచ్చితంగా ప్రయోజనం పొందుతామని అమిత్ షా  చెప్పారు. 

హిందీ భాషపై దక్షిణాది రాష్ట్రాల ఆలోచనపై.. 
కన్నడ భాష కోసం ఎవరైనా ఎక్కువ కృషి చేసి ఉంటే అది ఒక్క బీజేపీ మాత్రమేనని అమిత్ షా చెప్పారు. మోదీ వచ్చిన తర్వాత యూపీఎస్సీలో కన్నడలో పరీక్షల విధానం అమలులోకి వచ్చిందని తెలిపారు. తాము సీఆర్పీఎఫ్‌లో అన్ని భాషలకు ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. అన్ని ప్రాంతీయ భాషలను చదవాలని, మాట్లాడాలని అన్నదే తమ ప్రాధాన్యత అని చెప్పారు. ప్రియాంక గాంధీ ఇక్కడికి వస్తే ఏ భాషలో మాట్లాడతారు? అని ప్రశ్నించారు. తాను గుజరాత్ నుంచి వచ్చానని.. తనకు కన్నడ రాకపోతే హిందీలో మాట్లాడతానని చెప్పారు. స్థానిక భాషను ప్రోత్సహించేందుకు బీజేపీ చేసినంతగా ఏ పార్టీ కూడా చేయలేదని చెప్పారు. కన్నడ, గుజరాతీ, మరాఠీ భాషల్లో వైద్య పరీక్షలు నిర్వహించామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో పరీక్షలు హిందీ, ఇంగ్లీషులో మాత్రమే జరిగేవని  అన్నారు. 

ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రిని మారుస్తారా..?
ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై తమ ఎన్నికలకు నాయకత్వం వహిస్తున్నారని అమిత్ షా చెప్పారు. ఎన్నికల తర్వాత పరిస్థితిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇక, పార్టీ కార్యకర్తలపై తనకు చాలా నమ్మకం ఉందని  చెప్పారు. తాము వెనక ఉన్నామని  చెబుతున్న సర్వేలు.. ఎగ్జిట్ పోల్ వరకు తమ విజయాన్ని చెబుతాయని అన్నారు. మెజారిటీ రాదనే ప్రశ్నే లేదన్నారు. జేడీ(ఎస్)తో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. జేడీ(ఎస్)కు ఓటు వేయడం అంటే కాంగ్రెస్‌కి ఓటేయడం అని తాను ప్రజలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నానని అమిత్ షా చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios