Amit Shah: ‘చొరబాట్లు లేని పటిష్ట సరిహద్దు నిర్మిస్తాం’.. మయన్మార్‌లోకి ఫ్రీ ఎంట్రీ ఏరియాలో ఫెన్సింగ్
పటిష్టమైన, చొరబాట్లు లేని సరిహద్దుల నిర్మాణానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ సందర్భంగా మణిపూర్‌లోని మోరెహ్‌లో పది కిలోమీటర్ల స్ట్రెచ్‌ను కూడా మూసేసినట్టు, ఇప్పటికే ఫెన్సింగ్ కూడా వేసినట్టు వివరించారు.
Amit Shah: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇండో మయన్మార్ వెంట మొత్తం 1643 కిలోమీటర్ల పొడవు ఫెన్స్ నిర్మించాలని ఇది వరకే నిర్ణయం తీసుకున్నామని వివరించారు. చొరబాట్లు లేని పటిష్టమైన సరిహద్దును నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని తెలిపారు.
మొత్తం బార్డర్ పొడవులో మణిపూర్‌లోని మోరెహ్‌లోని 10 కిలోమీటర్ల స్ట్రెచ్‌ను ఇది వరకే మూసేశారని, ఆ ఏరియాలో ఫెన్సింగ్ వేసినట్టు కేంద్రమంత్రి తెలిపారు. దీనికితోడు హైబ్రిడ్ సర్వెలెన్స్ సిస్టమ్ గుండా ఫెన్సింగ్ వేస్తున్నామని, ఇందుకు సంబంధించి రెండు పైలట్ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని వివరించారు.
Also Read: KCR: కేసీఆర్‌కు జగన్ పరిస్థితే! రెండు పార్టీలకూ అదే సవాల్
ఫ్రీ ఎంట్రీ..
మణిపూర్‌లోని మోరెహ్‌లో గల ఆ స్ట్రెచ్‌కు చాలా ప్రాధాన్యత ఉన్నది. ఈ స్ట్రెచ్ గుండా మణిపూర్‌లోని పౌరులు మయన్మార్‌లోకి, మయన్మార్‌లోని వారు మణిపూర్‌లోకి వీసా లేకుండానే రావొచ్చు. సుమారు 16 కిలోమీటర్ల మేరకు ఆ దేశంలోకి వెళ్లవచ్చు. సరిహద్దు ప్రజలు బార్డర్ పాస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బార్డర్ పాస్ ఏడాది పాటు చెల్లుతుంది. ఆ పాస్ ఉంటే వెళ్లిన ప్రతిసారి రెండు వారాల పాటు ఆ దేశంలో ఉండటానికి అనుమతి ఉంటుంది. అవే అవకాశాలు మయన్మార్ సరిహద్దు వాసులకూ ఉంటుంది.
Also Read: GruhaJyothi: రెంట్‌కు ఉండే వారికి కూడా కరెంట్ ఫ్రీ
మణిపూర్‌లో మొన్నటి హింసకు కొందరు ఈ స్ట్రెచ్ కూడా కారణం అని భావిస్తుంటారు. ఫ్రీ ఎంట్రీ ఉండటం మూలంగా చాలా మంది ఆ దేశ పౌరులు అక్రమంగా మన దేశంలోకి వచ్చి నివాసం ఉంటున్నారని ఆరోపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే కేంద్రప్రభుత్వం మొత్తంగా ఫెన్సింగ్ వేయాలనే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అయితే.. ఈ ఫ్రీ ఎంట్రీ విధానం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడే అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.