KCR: కేసీఆర్‌కు జగన్ పరిస్థితే! రెండు పార్టీలకూ అదే సవాల్
కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్‌కు సిట్టింగ్ ఎంపీలు షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఇప్పటికే వెంకటేశ్ నేత కాంగ్రెస్‌కు జంప్ అయ్యారు. మరో ముగ్గురు సిట్టింగ్‌లు కూడా ఇదే దారిలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఇప్పుడు ఇదే పరిస్థితి ఏపీలో జగన్ ఎదుర్కొంటున్నారు.
Jagan: ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిస్థితే ఇప్పుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావుకు ఎదురవుతున్నది. ఇటు బీఆర్ఎస్, ఆటు వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారుతున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ వచ్చే అవకాశం లేని సిట్టింగ్‌లు జంప్ అవుతున్నారు.
బీఆర్ఎస్ ఫస్ట్ వికెట్ పడింది. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత పార్టీకి రాజీనామా చేశారు. ఆ వెంటనే కాంగ్రెస్‌లో చేరారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయనకు టికెట్ వచ్చే అవకాశాలు లేవనే వార్తలు రావడంతో ముందు జాగ్రత్తగా ఆయన కాంగ్రెస్ గూటికి చేరినట్టు తెలుస్తున్నది.
బీఆర్ఎస్‌కు తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలు ఉండగా.. అందులో ఏడుగురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ నిరాకరించే ఆలోచనలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఉన్నట్టు చర్చ జరిగింది. చేవెళ్ల ఎంపీ జీ రంజిత్ రెండ్డి, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్ రావులకు మాత్రమే బీఆర్ఎస్ మళ్లీ టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. కాగా, దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మెదక్ ఎంపీ పదవికి కొత్త ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే మిగిలిన ఆరుగురు ఎంపీలు పెద్దపల్లి నుంచి వెంకటేశ్ నేత, వరంగల్ నుంచి పసునూరి దయాకర్, మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, నాగర్ కర్నూల్ నుంచి పోతుగంటి రాములు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవితలకు ఈ సారి టికెట్లు దక్కేలా లేవు.
Also Read: GruhaJyothi: రెంట్‌కు ఉండే వారికి కూడా కరెంట్ ఫ్రీ
ఈ నేపథ్యంలో వెంకటేశ్ నేత పార్టీ మారారు. ఇదే దారిలో ఈ టికెట్లు దక్కని ఆరుగురు సిట్టింగ్‌లో కనీసం ముగ్గురైనా వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. మిగిలిన వారు వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్‌లో బెటర్ పొజిషన్‌తో సరిపెట్టుకునే ఛాన్స్ ఉన్నది.
వాస్తవానికి ఇదే పరిస్థితి ఏపీలో జగన్ ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే నరసాపురం వైసీపీ ఎంపీ కే రఘురామ కృష్ణం రాజు రెబల్‌గా మారారు. కాబట్టి, ఈయనకు వైసీపీ టికెట్ వచ్చే ఛాన్స్ లేదు. మరో ముగ్గురు ఎంపీలు లావు కృష్ణ దేవరాయులు, డాక్టర్ సంజీవ్ కుమార్, వీ బాలశౌరిలు ఇప్పటికే పార్టీ నుంచి బయటకు వచ్చారు. మరో సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా వైసీపీని వీడే యోచనలో ఉన్నట్టు తెలిసింది. వీరితోపాటు గోరంట్ల మాధవ్, జీ మాధవి వంటి వారికి ఇప్పటికే పార్టీ మొండిచేయి చూపింది. కానీ, వారు పార్టీ మారే నిర్ణయాలైతే తీసుకోలేదు.