Maharashtra political crisis: మహారాష్ట్రలో మరోసారి రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఆ తర్వాత పార్టీ కాంటాక్టులో లేకుండా పోవడంతో పోలిటికల్ హీట్ రాజేసింది.
Maharashtra: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఆ తర్వాత పార్టీ కాంటాక్టులో లేకుండా పోవడంతో పోలిటికల్ హీట్ రాజేసింది. మరోసారి రాష్ట్రంలో రాజకీయ సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మధ్య ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుత పరిస్థితులపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఏక్‌నాథ్ షిండే సహా ఇతర శివసేన ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేసి గుజరాత్‌లోని సూరత్‌లోని హోటల్‌కు వెళ్లారు.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలోకి జారుకుంటే.. ఏర్పడే పరిస్థితులు.. బీజేపీ తదుపరి ఎత్తుగడ, ఆ పార్టీకి సంఖ్యాబలం ఉందా లేదా అన్నదానిపై నేతలిద్దరూ చర్చించుకున్నట్లు సమాచారం. “ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే మెజారిటీని కోల్పోయారని నిరూపించడానికి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది” అని పార్టీకి చెందిన ఓ నాయకుడు వెల్లడించడం గమనార్హం. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తొందరపాటుకు బదులు, సంఖ్యాబలం తమకు అనుకూలంగా ఉండేలా బీజేపీ చర్యలు తీసుకుంటున్నదని సంబంధిత వర్గాలు సమాచారం. శివసేనకు చెందిన కనీసం 25 మంది ఎమ్మెల్యేలు సూరత్‌లోని ఓ హోటల్‌లో క్యాంప్ చేస్తున్నారు. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంపై వారు అసంతృప్తితో ఉన్నారని ఆయా వర్గాల పేర్కొంటున్నాయి.
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి కాకరేపుతుండటంతో ప్రస్తుత సంక్షోభంపై కేంద్ర నాయకత్వంతో చర్చించేందుకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఢిల్లీ వెళ్లారు. వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికపై కూడా నడ్డా, షా మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్ష అభ్యర్థిపై చర్చించేందుకు ఈ సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగే అవకాశం జరగనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ తన రాష్ట్ర ఇన్‌ఛార్జ్ హెచ్‌కే పాటిల్‌ను కూడా ముంబయికి పంపింది. ముంబయిలోని బాలాసాహెబ్ నివాసంలో కూడా పార్టీ నేతలు సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అయితే, మహారాష్ట్రలో 'రాజకీయ భూకంపం' రాబోతోందన్న ఊహాగానాలను శివసేన ఎంపీ మరియు ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ తోసిపుచ్చారు. అయితే MVA ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రతిపక్ష BJP అతిపెద్ద కుట్ర పన్నిందని ఆరోపించారు.
ఏక్‌నాథ్ షిండే ముంబయిలో లేరని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ధ్రువీకరించారు. కానీ, వారిని తాము సంప్రదించగలిగామని వివరించారు. ఏక్‌నాథ్ షిండేను ఉపయోగించి తమ ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నాలు సఫలం కావని అన్నారు. షిండే తమ పార్టీకి విశ్వసనీయమైన నేత అని వివరించారు. తమతోపాటు చాలా ఆందోళనల్లో ఆయన పాలుపంచుకున్నారని వివరించారు. ఆయన బాలాసాహెబ్ సైనికుడు అని చెప్పారు. శివసేన పార్టీనే విశ్వసనీయుల పార్టీ అని అన్నారు.
