ప్రతిష్టాత్మక పులిట్జర్ అవార్డును గెలుచుకున్న ఫ్రీలాన్స్ ఫొటోజర్నలిస్టు సనా ఇర్షద్ మట్టూ ఆ అవార్డును అందుకోవడానికి అమెరికాకు బయల్దేరారు. కానీ, అధికారులు ఆమెను ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే నిలిపేశారు. దీనిపై అమెరికా స్పందించింది.
న్యూఢిల్లీ: జర్నలిజంలో అత్యున్నత పురస్కారంగా పులిట్జర్ అవార్డుకు పేరుంది. ఈ అవార్డును అందుకోవడానికి ఆమె అమెరికాకు ప్రయాణం మొదలు పెట్టారు. ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆమెను ఎయిర్‌పోర్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆమె వద్ద అవసరైన అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ అడ్డుకున్నట్టు కథనాలు వచ్చాయి. ఈ విషయంపై అమెరికా రియాక్ట్ అయింది.
అమెరికా రాకుండా పులిట్జర్ అవార్డు విజేత జర్నలిస్టు సనా ఇర్షద్ మట్టను అడ్డుకున్న విషయం తమకు తెలిసిందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారులు ధ్రువీకరించారు. ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్టులో తనను అమెరికాకు వెళ్లకుండా నిలిపేశారని సనా మట్టూ మంగళవారం తెలిపారు. ప్రసిద్ధ పురస్కారాన్ని అందుకోవడానికి తాను అమెరికాకు బయల్దేరానని వివరించారు.
అమెరికాకు రాకుండా సనా ఇర్షద్ మట్టూను అడ్డుకున్నట్టు వచ్చిన కథనాలపై తమకు అవగాహన ఉన్నదని స్టేట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ ప్రతినిధి వేదాంత్ పటేల్ తెలిపారు. ఈ అంశాన్ని తమ డిపార్ట్‌మెంట్ క్లోజ్‌గా ట్రాకింగ్ చేస్తున్నదని వివరించారు.
Also Read: Pulitzer Prize winnerకు ఘోర అవమానం.. విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు
తాము పాత్రికేయ స్వేచ్ఛకు కట్టుబడి ఉన్నామని ఆయన వివరించారు. పత్రికా స్వేచ్ఛతోపాటు ఇతర ప్రజాస్వామిక విలువలపై అమెరికా, భారత్ సంబంధాలు నిర్మాణం అయ్యాయని తెలిపారు. అయితే, దీనిపై ప్రత్యేకంగా ఆఫర్ చేయడానికి తన వద్ద ఏమీ లేదని, కేవలం తాము క్లోజ్‌గా పరిశీలిస్తున్నామని వివరించారు.
కొవిడ్-19 సమయంలో ఫీచర్ ఫొటోగ్రఫీ కవరేజ్ చేసిన రాయిటర్స్ టీమ్‌కు పులిట్జర్ అవార్డు దక్కింది. ఈ బృందంలోనే ఫ్రీలాన్స్ ఫొటో జర్నలిస్టుగా మట్టూ కూడా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును గ్రహించడానికి ఆమె అమెరికాకు వెళ్లాల్సి ఉండింది.
