భారత్ షిప్‌యార్డులలో అమెరికా రక్షణ దళాల నౌకలు ఆగి రిపేర్ చేసుకుని వెళ్లే అవకాశాలపై ఉభయ దేశాలు పరిశీలనలు జరపడానికి అంగీకారం కుదిరింది. అమెరికా నేవీ షిప్‌ల మెయింటెనెన్స్ మాత్రమే కాదు వాటికి రిపేర్ చేసే అవకాశాలను పరిశీలించడానికి అంగీకరించినట్టు ఉభయ దేశాలు ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.
న్యూఢిల్లీ: అమెరికా రక్షణ దళాలకు చెందిన నౌకలు త్వరలో భారత షిప్‌యార్డుల్లో కొలువుదీరే అవకాశాలు ఉన్నాయి. భారత్ షిప్‌యార్డుల్లో అమెరికా నేవీ షిప్‌ల మెయింటెనెన్స్ మాత్రమే కాదు.. వాటికి రిపేరింగ్ చేసే అవకాశాలను ఉభయ దేశాలు ఆలోచించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ అవకాశాలు కార్యరూపం దాలిస్తే భారత్, అమెరికా దేశాల మధ్య రక్షణ వాణిజ్య మరింత బలోపేతం చేయడమే కాదు, భారత షిప్‌యార్డులకు అదనంగా బిజినెస్‌ను తెచ్చినట్టు అవుతుందని నిపుణులు యోచిస్తున్నారు.
భారత షిప్‌యార్డుల్లో అమెరికా నేవీ షిప్‌ల మెయింటెనెన్స్‌తోపాటు రిపేరింగ్ చేసే అవకాశాలను పరిశీలించాలనే నిర్ణయం సోమవారం వాషింగ్టన్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్నారు. 2+2 మినిస్ట్రియల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మంత్రులు ఆంటోనీ బ్లింకెన్, లాయిడ్ అస్టిన్‌లు, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లు భేటీ అయ్యారు.
ఉభయ దేశాల మధ్య నావికా రంగంలో రక్షణ పారిశ్రామిక సహకారాన్ని మరింత పెంచుకునే అవకాశాలను పరిశీలించడానికి ఇరువైపులా సమ్మతం లభించిందని భేటీ అనంతరం రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన వెల్లడించింది. అదే సందర్భంలో భారత షిప్‌యార్డులను మరింత వినియోగించుకోవడం అంటే.. అమెరికా మేరిటైమ్ సియలిఫ్ట్ కమాండ్ షిప్‌ల మెయింటెనెన్స్, రిపేర్లకు ఉపయోగించుకోవాలని, తద్వారా యూఎస్ నావల్ షిప్‌ల ప్రయాణంలో మార్గమధ్యలోనే ఈ రిపేర్ చేసుకోవడానికి వీలు
చిక్కుతుందనే ఆలోచనలు ఉన్నట్టు ఆ ప్రకటన తెలిపింది.
గత దశాబ్ద కాలంగా భారత్, అమెరికాల మధ్య రక్షణ ఒప్పందాలు అనూహ్యంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్‌లో మిలిటరీ మధ్య ఒప్పందాల్లో ఇవి కీలకంగా ఉన్నాయి.
21వ శతాబ్దపు సమస్యల పరిష్కారానికి అమెరికా, భారత్‌ల మధ్య భాగస్వామ్యం చాలా కీలకమైనదని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మంగళవారం అన్నారు. భారత విదేశాంగ మంత్రితో ఆయన సమావేశం అయిన ఒక రోజు తరువాత ఈ మేరకు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఇరు పక్షాలు ఉన్నత విద్యా సంస్థల మధ్య బంధాలను బలోపేతం చేయడంపై చర్చించారు
ఈ సందర్భంగా హోవార్డ్ యూనివర్శిటీ ఫర్ ఇండియా-యుఎస్ ఎడ్యుకేషన్ కోలాబరేషన్ విద్యార్థులు, అధ్యాపకులతో బ్లింకెన్ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూఎస్ యూనివర్సిటీలలో దాదాపు 200,000 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు.
ఈ సమ్మేళనం సందర్భంగా బ్లింకెన్ మాట్లాడుతూ.. ‘‘ 21వ శతాబ్దపు సమస్యలను పరిష్కరించడానికి యూఎస్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఖచ్చితంగా కీలకమని నేను విశ్వసిస్తున్నాను. మీ కృషి ఆ బంధానికి మూలాధారం ’’ అని పేర్కొన్నారు.
‘‘ యూఎస్‌లో 200,000 మంది భారతీయ విద్యార్థులు మా క్యాంపస్‌లల్లో చదువుకోవడం ఆనందంగా భావిస్తున్నాం. దీంతో పాటు ఫుల్‌బ్రైట్ లేదా గిల్‌మాన్ ఫెలోషిప్‌ల వంటి ప్రోగ్రామ్‌ల ద్వారా చాలా మంది అమెరికన్ విద్యార్థులు భారతదేశంలో కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు. ’’ అని బ్లింకెన్ అన్నారు. ఇరు దేశాల ప్రజల కోసం వర్కింగ్ గ్రూప్‌ని ఏర్పాటు చేసి నేర్చుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ‘‘ ప్రజలకు సేవలు సులభతరం చేయడానికి యూఎస్, భారతదేశంలోని విద్యా సంస్థలో విద్య, నైపుణ్య శిక్షణపై వర్కింగ్ గ్రూప్ కలిసి కొత్త ఉమ్మడి పరిశోధన కార్యక్రమాన్ని అభివృద్ధి చేస్తోంది’’ అని ఆయన చెప్పారు.
