Amarnath Yatra2022: అమర్‌నాథ్ యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభమై ఆగస్టు 11న రక్షా బంధన్ రోజున ముగుస్తుంది. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డును కలిగి జమ్మూకశ్మీర్‌ యంత్రాంగం పేర్కొంది. లేకుంటే వారు దర్శనానికి దూరమయ్యే అవకాశం ఉంది.  

Amarnath Yatra 2022: ఈ ఏడాది మీరు అమర్‌నాథ్ యాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే.. మీ కోసం ఒక ముఖ్యమైన వార్త. జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ ప్రయాణీకుల కోసం కొత్త సూచనను జారీ చేసింది. ఈ విష‌యాల‌ను త‌ప్ప‌ని స‌రిగా తెలుసుకోవాలి. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు 2 సంవత్సరాలు వాయిదా పడిన అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 30 నుండి ప్రారంభం కానుంది. 43 రోజుల పాటు జ‌రిగే యాత్రకు సంబంధించిన సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదిలా ఉండగా అమర్‌నాథ్ యాత్రకు వచ్చే ప్రయాణికులకు ఆధార్‌కార్డు వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేస్తూ జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. అంటే.. ఈ ప్రయాణంలో వచ్చే వ్యక్తులు ఆధార్ కార్డును తీసుకెళ్లడం తప్పనిసరి.

ఆధార్ కార్డు తప్పనిసరి 

రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. అమర్‌నాథ్ యాత్ర 2022 చేపట్టాలనుకునే ప్రయాణికులు ఆధార్ కార్డును త‌మ‌తో పాటు తీసుకెళ్లాల‌ని సూచించింది. అది లేకుండా ప్రయాణం చేసేవారిని యాత్ర‌కు అనుమ‌తించ‌మ‌ని తేల్చి చెప్పింది. ఈసారి ఉగ్ర‌వాదులు ప్రయాణికుల వేషధారణలో దాడి చేసే ప్రమాదం ఉందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అందువల్ల ప్రయాణికుల గుర్తింపును నిర్ధారించేందుకు ఆధార్ కార్డును తప్పనిసరి చేశారు. ప్రత్యేక యంత్రాల ద్వారా ఈ ఆధార్ కార్డు వెరిఫికేషన్ నిర్వ‌హించ‌నున్నారు.

ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ యంత్రాంగం సోమవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. యాత్రను సందర్శించే యాత్రికులకు వివిధ సేవలను అందించేందుకు ఈ ఏడాది 35 వేల మంది కార్మికులు బల్తాల్, నున్వాన్ (పహల్గామ్)లో నమోదు చేయించుకున్నారు. ఇది మాత్రమే కాదు.. యాత్రికులకు గుర్రపు మ్యూల్ సేవలను అందించే వారికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డివైస్ (RFID) కార్డులు అందించ‌నున్నారు.

కథువాలో 20 విశ్రాంతి స్థలాలు నిర్మాణం

అమర్‌నాథ్ యాత్ర 2022లో వచ్చే యాత్రికుల బస కోసం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో 20 విశ్రాంతి స్థలాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశాలలో ఒకేసారి 8 వేల మంది బస చేయనున్నారు. ఈ విశ్రాంతి స్థలాల్లో లంగర్ సౌకర్యం కూడా ఉంటుందని కథువా డిప్యూటీ కమిషనర్ రాహుల్ పాండే తెలిపారు. దీంతోపాటు మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌ల ఏర్పాట్లు కూడా చేశారు. ఈ సౌకర్యాలన్నీ భక్తులకు ఉచితంగా అందజేయనున్నారు.

10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా

ఈసారి యాత్ర (అమర్‌నాథ్ యాత్ర 2022) జూన్ 30 నుండి ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతుంది. ఈ యాత్రలో దాదాపు 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని ప్ర‌భుత్వం అంచనా వేస్తుంది. ఈ యాత్ర‌ను కాశ్మీర్‌లోని 2 మార్గాల్లో చేయ‌వ‌చ్చు. ఈ మార్గాలలో ఒకటి దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్ మార్గం. ఈ మార్గం 48 కి.మీ పొడవు మరియు దీని ద్వారా 3 రోజుల్లో ఎక్కి దిగ‌వ‌చ్చు. రెండవ మార్గం బాల్టాల్ నుండి.. దాదాపు 14 కి.మీ పొడవున్న ఈ మార్గం ఒక్కరోజులో వెళ్లి రావచ్చు.