Amarnath Yatra 2022: శుక్రవారం (జూలై 8) గుహ మందిరం సమీపంలో వరదల కారణంగా కనీసం 16 మంది మరణించారు. 37 మందికి పైగా గాయపడ్డారు. 15,000 మంది సురక్షితంగా రక్షించబడ్డారు. ఈ క్రమంలోనే అమర్ నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది.  

Amarnath Yatra news updates: శుక్రవారం సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన అమర్‌నాథ్ యాత్ర తిరిగి మళ్లీ ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో 7,000 మందికి పైగా అమర్‌నాథ్ యాత్రికులు మంగళవారం ఉదయం జమ్మూ నగరంలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుండి బయలుదేరినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 7,107 మంది యాత్రికులతో కూడిన 13వ బ్యాచ్ కాశ్మీర్ లోయలోని పహల్గామ్, బల్తాల్ జంట బేస్ క్యాంపులకు రెండు వేర్వేరు కాన్వాయ్‌లలో 265 వాహనాల్లో బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 3.40 గంటలకు బల్తాల్‌కు 98 వాహనాల్లో 1,949 మంది భక్తులు బయలుదేరగా, తెల్లవారుజామున 4.30 గంటలకు నున్వాన్-పహల్గాం బేస్ క్యాంపుకు 175 వాహనాల్లో 5,158 మంది యాత్రికులు బయలుదేరారు.

దీనితో, జూన్ 29 నుండి ఇప్ప‌టివ‌ర‌కు 76,662 మంది యాత్రికులు భగవతి నగర్ బేస్ క్యాంపు నుండి లోయకు బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మొదటి బ్యాచ్ యాత్రికులను జెండా ఊపి ప్రారంభించారు. దక్షిణ కాశ్మీర్ హిమాలయాలలోని 3,880 మీటర్ల ఎత్తైన గుహ పుణ్యక్షేత్రానికి 43 రోజుల సుదీర్ఘ యాత్ర జూన్ 30న జంట ట్రాక్‌ల నుండి ప్రారంభమైంది. దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సాంప్రదాయ 48-కిమీ నున్వాన్-పహల్గామ్ మార్గం, 14-కిమీ పొట్టి బల్తాల్, మధ్య కాశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లా మ‌ధ్య యాత్ర కొన‌సాగ‌నుంది. ఇప్పటివరకు 1.20 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్ గుహ క్షేత్రాన్ని సందర్శించారు. ఆగస్ట్ 11న రక్షా బంధన్‌తో పాటు 'శ్రావణ పూర్ణిమ' సందర్భంగా ఈ పాదయాత్ర ముగియనుంది.

ఇదిలావుండగా, శుక్రవారం (జూలై 8) గుహ మందిరం సమీపంలో వరదల కారణంగా కనీసం 16 మంది మరణించారు, దాదాపు 37 మందికిపైగా గాయపడ్డారు. 15,000 మంది సురక్షితంగా రక్షించబడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40 మంది యాత్రికులు తప్పిపోయారన్న నివేదికలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది. ఆ రాష్ట్రానికి చెందిన ఇద్దరు యాత్రికులు మాత్రమే ఇప్పటికీ తప్పిపోయారని, మిగతా వారందరూ సురక్షితంగా ఉన్నారని చెప్పారు. యాత్రికుల కోసం హెలికాప్టర్ సేవలు రెండు బేస్ క్యాంపుల నుండి గుహ మందిరం వరకు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

అమర్ నాథ్ యాత్రపై నాలుగు రోజుల క్రితం ఒక క్లౌడ్‌బర్స్ట్ విరుచుకుపడటంతో అమర్‌నాథ్ గుహ పుణ్యక్షేత్రం సమీపంలో వరదలు వచ్చాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 మంి వరకు గాయపడ్డారు. అనేక మంది తప్పిపోయారు. గాయపడిన మరో యాత్రికులను ఆదివారం IAF Mi-17 V5, చీటల్ హెలికాప్టర్ల ద్వారా తరలించారు. IAF హెలికాప్టర్లు శిథిలాల కింద చిక్కుకున్న తప్పిపోయిన వ్యక్తుల కోసం వెతకడానికి ఆరు కుక్కలతో పాటు 20 మంది NDRF సిబ్బందిని కూడా విమానంలో పంపించారు. శుక్రవారం పవిత్రమైన అమర్‌నాథ్ పుణ్యక్షేత్రం సమీపంలో మేఘాల విస్ఫోటనం సంభవించిన తరువాత, శిధిలాల కింద ప్రాణాలతో బయటపడిన వారిని గుర్తించడానికి భారత సైన్యం ఆదివారం రాడార్‌లను రంగంలోకి దించింది. పరిస్థితులు కాస్త మెరుగుపడటంలో అమర్ నాథ్ యాత్ర మళ్లీ షురు అయిన క్రమంలోనే అధికారులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు.