వయోజనులు తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చనీ, తమకు నచ్చిన వారితో కలిసి జీవించడానికి స్వేచ్ఛ ఉందని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. రాజ్యాంగం హామీ ఇచ్చిన జీవించే హక్కు నుంచి ఈ వ్యక్తిగత స్వేచ్ఛ ఉద్భవించిందని కోర్టు పేర్కొంది.
వయోజనుల వివాహం, సహాజీవనం విషయంలో అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వయోజనులు తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి లేదా వారికి నచ్చిన వ్యక్తితో కలిసి జీవించడానికి స్వేచ్ఛని కలిగి ఉంటారని, ఈ విషయంలో తల్లిదండ్రులు లేదా ఇతరులు ఎవరైనా భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. రాజ్యాంగం హామీ ఇచ్చిన జీవించే హక్కు నుంచి ఈ వ్యక్తిగత స్వేచ్ఛ ఉద్భవించిందని కోర్టు పేర్కొంది.
లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో మతాంతర జంట దాఖలు చేసిన పిటిషన్‌ను తొలగిస్తూ.. జస్టిస్ సురేంద్ర సింగ్.. పిటిషనర్ల తమ శాంతియుత జీవితానికి ఏదైనా ఆటంకం కలిగితే.. సంబంధిత పోలీసు సూపరింటెండెంట్‌ని ఆశ్రయించాలని ఆదేశించారు. తమ పిటిషన్‌లో ముస్లిం మహిళ, తన హిందూ లైవ్-ఇన్ ఉన్నామనీ, తమ ప్రశాంతమైన జీవితంలో జోక్యం చేసుకోవద్దని వారి కుటుంబ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. భద్రత విషయంలో పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పిటిషనర్ల తరఫు న్యాయవాది మాట్లాడుతూ .. ఇద్దరూ వయోజనులని, వారు తమ ఇష్టానుసారం లైవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారని చెప్పారు. మహిళ తల్లి, ఆమె కుటుంబ సభ్యులు లివ్-ఇన్ రిలేషన్ షిప్‌కు వ్యతిరేకమని పేర్కొన్నారు.
మహిళ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు పిటిషనర్లను వేధిస్తున్నారని, వారి ప్రశాంతమైన జీవితానికి భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. అలాగే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కొవల్సి ఉంటుందని పిటిషనర్లను బెదిరించినట్లు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని ఆ మహిళ ఆగస్టు 4న గౌతమ్ బుద్ధ నగర్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్‌ను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
