బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలి: మెహబూబా ముఫ్తీ
Jammu Kashmir: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలని జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. మహా ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ కేంద్ర బిందువుగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.

PDP president Mehbooba Mufti: 2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పీడీపీ అధినేత్రి, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అన్నారు. శ్రీనగర్ లో వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరముందన్నారు. మహా ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ కేంద్ర బిందువుగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే, ఇది జరగకుడా బీజేపీ ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బకొట్టే చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై పలు ప్రతిపక్ష పార్టీలు నడుచుకుంటున్న తీరుపైనా ఆమె వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ నాయకురాలు మాయావతి మౌనం వహించడాన్ని ముఫ్తీ ప్రశ్నించారు.
విపక్షాలు ఏకతాటిపైకి రాకపోతే బీజేపీకి బలమైన ప్రతిపక్షం ఏర్పడుతుందని తాను భావించడం లేదన్నారు. “ప్రతిపక్ష పార్టీలు కలిసి రానంత వరకు, బీజేపీకి బలమైన వ్యతిరేకత వస్తుందని నేను అనుకోను. వారు ఈ ED, NIA, ఇతర దర్యాప్తు ఏజెన్సీలతో వారి గొంతులో కలిసి వచ్చే స్థితిలో ఉన్నారా? అఖిలేష్ యాదవ్, మాయావతిని చూడండి. వాళ్ళు ఏమీ అనడం లేదు. ఎందుకు మౌనంగా ఉన్నారు?" అంటూ ప్రశ్నించారు. ఇంత భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అద్భుతాలు చేసి ఉండవచ్చు కానీ దురదృష్టవశాత్తు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పినట్లు వారికి దేశం పట్ల విజన్ లేదని మెహబూబా ముఫ్తీ కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. వారు (బీజేపీ) ఈ దేశాన్ని 'మాఫియా'లా పాలిస్తున్నారని తెలుస్తోందని విమర్శించారు.
బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తాయా లేదా అనే సందేహాలు తనకు ఉన్నాయని పీడీపీ అధ్యక్షురాలు ముఫ్తీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రతిపక్షానికి నాయకత్వం వహించడం వారికి (బీజేపీ) ఇష్టం లేదు.. అందుకే ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. మైనారిటీల స్థితిగతులపై అడిగిన ప్రశ్నకు మెహబూబా సమాధానమిస్తూ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ముస్లింలే మొదటి టార్గెట్ అని, వారిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరి వెంట వెళ్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ముస్లింలే మొదటి టార్గెట్ కానీ ఇప్పుడు ఇది బీజేపీ వర్సెస్ ఆల్ గా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
తమను ఎవరు వ్యతిరేకించినా, అసమ్మతి గళం వినిపించేందుకు ప్రయత్నించినా వారిని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. అందులో హిందువులు, సిక్కులు, దళితులు ఇలా అందరూ ఉన్నారని పేర్కొన్నారు. అలాగే, బిల్కిస్ బానో రేపిస్టులను విడుదల చేయడమే కాదు, హిందూ మహిళలపై అత్యాచారం చేసి చంపిన వారిని కూడా బయటకు వదిలిపెట్టారంటూ విమర్శించారు. కొందరు మితవాద నాయకులు హిందూ దేశాన్ని డిమాండ్ చేయడాన్ని ప్రస్తావిస్తూ, వారు దానిని బీజేపీ రాజ్యంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు.