దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అనంతరం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు పూర్తయ్యాయి. కానీ కేరళలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. వరుసగా రెండవసారి అధికారం చేజిక్కించుకున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది.

ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు రెండవసారి పట్టం కట్టారు ప్రజలు. పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్  ప్రభుత్వ కేబినెట్ మరో రెండ్రోజుల్లో అంటే ఈ నెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుంది. తిరువనంతపురంలోని సెంట్రల్​ స్టేడియంలో ఆరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

రాష్ట్ర గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్​ఖాన్​ విజయన్​తో ప్రమాణం చేయించనున్నారు. సీఎంతో పాటు మరో 21 మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారు. మొత్తం 21 మంది స‌భ్యుల‌తో కేర‌ళ మంత్రివ‌ర్గం కొలువుదీర‌నుంద‌ని విజ‌య‌రాఘ‌వ‌న్ తెలిపారు.

నూత‌న క్యాబినెట్‌లో ఎల్‌డీఎఫ్ కూటమిలోని ప్ర‌ధాన పార్టీ అయిన సీపీఐ (ఎం)కు 12 స్థానాలు, సీపీఐకి నాలుగు స్థానాలు కేటాయించినట్లు ఆయ‌న వెల్ల‌డించారు. మిగిలిన ఐదు స్థానాల్లో కేర‌ళ కాంగ్రెస్ పార్టీ, జ‌న‌తాద‌ల్ (ఎస్‌), నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) పార్టీల‌కు ఒక్కో బెర్త్ ఖాయం చేసిన‌ట్లు చెప్పారు.

అయితే సిట్టింగ్ మంత్రుల్లో ఎవరికి పినరయి విజయన్ రెండోసారి అవకాశం కల్పించకపోవడం కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సీఎం విజయన్ తప్పించి నూతన మంత్రి వర్గంలో అంతా కొత్త ముఖాలే కనిపించనున్నాయి.

కరోనా, వరదలు, ఎబోలా వంటి విపత్కర సమయాల్లో తన సేవలతో జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకున్న ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజను సైతం విజయన్ పక్కనబెట్టారు. ఎంబీ రాజేశ్‌కు స్పీకర్‌గా, శైలజను పార్టీ విప్‌గా, టీపీ రామకృష్ణను పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించాలని విజయన్ నిర్ణయించారు.