Asianet News TeluguAsianet News Telugu

మద్యం దేవుని వంటిది.. కనిపించదు.. కానీ, అంతటా ఉంటుంది: నితీశ్ కుమార్ పై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కామెంట్లు

బిహార్‌లో మద్యం దైవం వంటిదని, బయటికి కనిపించదని, కానీ, అంతటా అదే ఉంటుందని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ అన్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ పై విమర్శలు సంధిస్తూ నిషేధం సమర్థంగా అమలు చేయలేకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని అన్నారు.
 

alcohol is like god in bihar union minister giriraj singh slams cm nitish kumar
Author
First Published Dec 15, 2022, 7:12 PM IST

పాట్నా: బిహార్‌లో కల్తీ మద్యం తాగి మరణించినవారి సంఖ్య 30 దాటి పెరుగింది. శరణ్ జిల్లా చాప్రా టౌన్‌లో ఈ కల్తీ మద్యం విషాదం చోటుచేసుకున్నది.దీనిపై రాష్ట్రమంతా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నాయి. అసెంబ్లీలోనూ అధికార జేడీయూ, ఆర్జేడీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్ కూడా బిహార్ సీఎం నితీశ్ కుమార్ పై విమర్శలు సంధించారు.

‘దేవుడు మనిషి కంటికి కనిపించడు. కానీ, ఆయన సర్వంతర్యామి. ఎక్కడ వెతికినా.. అక్కడ ఆయన ఉంటాడు. బిహార్‌లో మద్యం కూడా అలాంటిదే. బయటికి కనిపించదు. కానీ, అంతటా లిక్కర్ అమ్మకం జరుగుతున్నది’ అని ఆయన అన్నారు. బిహార్‌లో ఆకలి చావులనూ నితీశ్ కుమార్ పట్టించుకోవడం లేదని, ఆయన ఓ విఫల నేత అని కూడా తెలుసుకోలేకపోతున్నారని ఆరోపించారు. గడిచిన పదేళ్ల నుంచి బిహార్‌లో ఆయన చేసినదేమీ లేదని వివరించారు. ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఇందుకు కారణం ఉన్నదని పేర్కొన్నారు. ఒకటి ఆయన వయసు పెరుగుతూ ఉంటే ఆయన అధికారం తగ్గుతూ పోతున్నదని అన్నారు. ప్రభుత్వాన్ని నడిపే మానసిక ఆరోగ్యం ఆయనకు లేదని ఆరోపణలు చేశారు. 

Also Read: ‘లిక్కర్ తాగితే చస్తారుగా మరీ’..కల్తీ మద్యం మరణాలపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలపై నితీశ్ కుమార్ విరుచుకుపడటాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. గిరిరాజ్ సింగ్‌తోపాటు బీజేపీ ఎంపీ, కేంద్రమంత్రి రామ్ క్రిపాల్ యాదవ్ కూడా నితీశ్ కుమార్‌ను విమర్శించారు. బిహార్ రాష్ట్రంలో మద్యపానంపై నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడం నితీశ్ కుమార్‌కు చేతకాకపోతే సీఎం పీఠాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు.

కల్తీ మద్యం తాగి మరణించినవారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌ను సీఎం నితీశ్ కుమార్ దాదాపు కొట్టేశారు. రాష్ట్రంలో 2016 నుంచి మద్యపానంపై నిషేధం ఉన్నసంగతి తెలిసిందే అని, ప్రజలు మరింత జాగరూకతగా మెలగాల్సిన అవసరం ఉన్నది అని ఆయన అన్నారు. అంతేకాదు, లిక్కర్ తాగితే చస్తారు కదా అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మద్యపానంపై నిషేధాన్ని ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని, ఈ అలసత్వాన్ని పేర్కొంటూ ప్రతిపక్షాలు నితీశ్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మద్యం ఎవరైతే తాగుతారో వారు చస్తారు కదా.. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ముందు ఉన్నది. తాగితే చస్తావ్’ అని తెలిపారు. గతంలో ఇలాంటి కల్తీ మద్యం మరణాలకు నష్ట పరిహారాలను ప్రస్తావిస్తూ ఈ కామెంట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios