మాజీ సీఎస్ ఆలాపన్ బందోపాధ్యాయ్ వ్యవహారం పశ్చిమ బెంగాల్- కేంద్రం మధ్య అగ్గిరాజేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఆలాపన్ వివాదం ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. ఆయనకు తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని దీదీ ప్రకటించారు.  ఆయనకేం జరగకుండా తాము చూసుకుంటామని.. మమత హామీ ఇచ్చారు. కాగా, పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి అలాపన్ బంధోపాధ్యాయ్ కేంద్రం వద్ద రిపోర్ట్ చేయాలని డీవోపీటీ ఆదేశాలు జారీచేసింది. అలాపన్‌ను రివీల్ చేయాలన్న ఆదేశాలకు మమతా బెనర్జీ అంగీకరించలేదు. దీనికి తోడు ఆయన పదవీ కాలం సోమవారంతో ముగిసింది. ఆ వెంటనే ఆయనను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించింది దీదీ సర్కార్.

అయితే అలాపన్ బంధోపాధ్యాయ్ కేంద్రం వద్ద రిపోర్ట్ చేయకపోవడంతో డీవోపీటీ సీరియస్ అయ్యింది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద అలాపన్‌కు నోటీసులు జారీ చేసింది. బెంగాల్ సీఎస్‌పై డీవోపీటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో అలాపన్ బంధోపాధ్యాయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటీ.? ఆయన ఎలాంటి విచారణ ఎదుర్కొనే అవకాశం వుందన్న దానిపై చర్చ జరుగుతోంది.

Also Read:పంతం నెగ్గించుకొన్న మమత:సీఎస్ పదవికి బందోపాధ్యాయ రాజీనామా

డీవోపీటీ అధికారుల ముందు హాజరుకానీ అలాపన్ బంధోపాధ్యాయ్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అలాపన్‌ పశ్చిమ బెంగాల్‌కు సీఎస్‌గా వున్నారు. గత నెల 31తో ఆయన పదవీ కాలం ముగిసింది. యాస్ తుఫాన్ సమయంలో ఆయన అసమర్ధంగా వున్నారన్నది కేంద్రం వాదన. కానీ సమర్థవంతంగా పనిచేసినట్లుగా బెంగాల్ ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన సలహాదారుగా ఆయనను నియమించింది. కొత్త చీఫ్ సెక్రటరీగా హెచ్ కే ద్వివేదిని నియమించింది.

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటన సందర్భంగా నిర్వహించిన సమీక్షా సమావేశానికి సీఎస్‌గా అలాపన్ గైర్హజరయ్యారు. ప్రధాని షెడ్యూల్ సమావేశంలోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సీఎస్‌ అలాపన్ పశ్చిమ మిడ్నాపూర్‌లోని కలైకుండాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో పర్యటించారు. ఆ తర్వాత మోడీకి 20,000 వేల కోట్ల ఆర్ధిక సాయం చేయాల్సిందిగా దీదీ విజ్ఞప్తి చేశారు. అయితే ఆ సమయంలో మోడీని మమత దాదాపు 30 నిమిషాల పాటు వెయిట్ చేయించారంటూ బీజేపీ శ్రేణులు భగ్గుమన్న సంగతి తెలిసిందే.