Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ.. భేటీకి ముందు ఎస్పీ నేత ఏం చెప్పారంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు.

akhilesh yadav Meets KCR At hyderabad Pragathi bhavan ksm
Author
First Published Jul 3, 2023, 2:44 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ భేటీ కోసం హైదరాబాద్‌లోని  ప్రగతిభవన్‌కు చేరుకున్న అఖిలేష్ యాదవ్‌ను సీఎం కేసీఆర్ సాదర స్వాగతం పలికారు. అనంతరం అఖిలేష్‌తో పాటు పలువురు నేతలకు మధ్యాహ్న భోజన ఆతిథ్యం ఇచ్చారు. అనంతరం కేసీఆర్‌, అఖిలేష్ యాదవ్‌లు జాతీయ రాజకీయాలపై చర్చలు జరుపుతున్నారు. .మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి ఎస్ వేణుగోపాలచారి కూడా ప్రగతిభవన్‌లో ఉన్నారు. 

ఇక, అంతకుముందుకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు  చేరుకున్న అఖిలేష్ యాదవ్‌కు  మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి‌లు స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే విలేకరులకు ప్రశ్నలకు సమాధానమిచ్చిన అఖిలేష్ యాదవ్.. బీజేపీని గద్దె దింపాలంటే విపక్ష పార్టీలన్ని ఏకం కావాలని అన్నారు.  బీజేపీ వ్య‌తిరేకుల‌ను క‌లుపుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. విప‌క్షాల పోరాటంపై కేసీఆర్‌తో చ‌ర్చించేందుకు వ‌చ్చాన‌ని తెలిపారు. అంద‌రి ల‌క్ష్యం కూడా బీజేపీని అధికారం నుంచి దించ‌డ‌మే అని స్ప‌ష్టం చేశారు. కేసీఆర్‌తో భేటీ త‌ర్వాత అన్ని విష‌యాలు మాట్లాడుతాను అని అఖిలేష్ చెప్పారు. 

చర్చనీయాంశంగా అఖిలేష్ పర్యటన.. 
కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా దేశంలో పలు ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల కూటమిలో అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకి అఖిలేష్ కూడా హాజరయ్యారు. మరోవైపు విపక్షాల కూటమిలో ఉన్న కాంగ్రెస్‌తో సహా పలు పార్టీలు.. బీఆర్‌ఎస్‌ను బీజేపీ బీ టీమ్‌గా ఆరోపణలు చేస్తున్నాయి. ఆదివారం  ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ జనగర్జన సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతికి మోదీ  అండదండలు ఉన్నాయని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీని  ఓడించినట్టే.. తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడిస్తామని అన్నారు. అయితే ఇలాంటి సమయంలో అఖిలేష్ స్వయంగా హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌తో చర్చలు జరపుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios