UP Assembly Election 2022:  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్నాయి. ఆధికారం ద‌క్కించుకోవ‌డం కోసం అన్ని ప్ర‌ధాన పార్టీలు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నాయి. అయితే, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీ ఎన్నిక‌ల రేసులో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే ఆ పార్టీని ఇర‌కాటంలో పెట్టే విధంగా భీం ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  

UP Assembly Election 2022: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గున్నాయి. దీని కోసం అన్ని పార్టీలు సిద్ధ‌మ‌వుతున్నాయి. అధికార పీఠం ద‌క్కించుకోవ‌డానికి ఇత‌ర పార్టీల‌తో పొత్తులు, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ విష‌యంలో అధికార పార్టీ బీజేపీ కంటే రాష్ట్ర మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ నేతృత్వంలోని స‌మాజ్‌వాదీ (Samajwadi) పార్టీ కాస్త ముందున్న‌ద‌ని చెప్పాలి. ప్రాంతీయ పార్టీలతో సమాజ్‌వాదీ పార్టీ కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రాణాళికలు చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలు పార్టీల నాయకులు, ప్రతినిధులతో భేటీ అయ్యారు. దీనికోసం భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో కూడా పొత్తుల గురించి చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే, చంద్రశేఖర్ ఆజాద్ 10 సీట్లు అడగగా.. అఖిలేష్ మూడు సీట్లే ఆఫర్ చేసినట్లు భీమ్ ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ఇదే విష‌యం గురించి మీడియాకు వెల్ల‌డించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ (Chandrashekhar Azad).. ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌మాజ్ వాదీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అఖిలేష్ మమ్మల్ని అవమానించారు.. బహుజన సమాజాన్ని అవమానపరిచారు అంటూ చంద్రశేఖర్ ఆజాద్ పేర్కొన్నారు. ఆ పార్టీకి ద‌ళితులు మ‌ద్ద‌తు అవ‌స‌రం లేద‌ని తెలిపారు. అలాగే, వచ్చే నెలలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ రాజకీయ సంస్థ ఆజాద్ సమాజ్ పార్టీ (Azad Samaj Party).. సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోదని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ స్పష్టంచేశారు. అఖిలేష్ (Akhilesh Yadav) కూటమిలో దళిత నాయకులు వద్దు.. కానీ దళితుల ఓట్లు మాత్రం కావాలి అంటూ విమ‌ర్శించారు. దళితులు ఆయనకు ఓటు వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనం మాట్లాడలేమ నే భయం మొదలైందన్నారు. 

"అఖిలేష్ (Akhilesh Yadav) జీకి ఈ కూటమిలో దళిత నాయకులు వద్దు... దళితుల ఓట్లు మాత్రమే కావాలి. దళితులు ఆయనకు ఓటు వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మనం మాట్లాడలేమని నా భయం. మా సమస్యల గురించి అతనికి చెప్పండి... మమ్మల్ని కొట్టినా, మా భూములు దోచుకున్నా, మా మహిళలపై అత్యాచారం చేసినా స్పందించ‌రు" అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు భీం ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్‌. ఎన్నిక‌ల్లో పోటీ చేసే పోత్తుల విష‌యంలో అఖిలేష్ యాద‌వ్ తమని మోసం చేశారని పేర్కొన్నారు. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. రాష్ట్రంలో త్వరలోనే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటయ్యే అవకాశం కూడా ఉంద‌ని ఆజాద్ (Chandrashekhar Azad) తెలిపారు. 

ఇదిలావుండ‌గా భీం ఆర్మీ చీఫ్ చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్‌ సమాజ్ పార్టీతో పొత్తుపై అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) మీడియాతో మాట్లాడుతూ.. భీమ్ ఆర్మీ చీఫ్‌కు మూడు సీట్లు కేటాయిస్తామని చెప్పామని అన్నారు. అయితే, ఆజాద్ దానికి నిరాకరిస్తూ.. 10 సీట్లు అడుగుతున్నార‌ని తెలిపారు. దీని కార‌ణంగానే ఆయ‌న (Chandrashekhar Azad) కూటమి లో క‌ల‌వ‌డానికి నిరాక‌రించార‌ని తెలిపారు. కాగా, ఉత్తరప్రదేశ్ శాసనసభ గడువు మే నెలతో ముగియ‌డంతో.. మొత్తం 400 కు పైగా అసెంబ్లీ స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి ఎన్నిక‌ల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 3, మార్చి 7 తేదీల్లో మొత్తం 7 దశల్లో ఓటింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడి కానున్నాయి.