షిండేపై వేటు పడుతుంది.. నెక్స్ట్ సీఎం అజిత్ పవార్: సంజయ్ రౌత్ సంచలనం
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో మహారాష్ట్ర సీఎం మారుతారని, ఏక్ నాథ్ షిండేను తొలగించి అజిత్ పవార్‌కు సీఎం బాధ్యతలు అప్పగిస్తారని వివరించారు. ఏక్‌నాథ్ షిండే, ఆయనతోపాటు వెళ్లిన ఇతర ఎమ్మెల్యేలపై వేటు ఖాయం అని, అందుకే బీజేపీ అజిత్ పవార్‌ను చీల్చిందని తెలిపారు.
ముంబయి: మహారాష్ట్రలో రాజకీయాలు ఊహించని రీతిలో జరుగుతుంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇక్కడ హై హీటెడ్ పాలిటిక్స్ చూశాం. ఈ నాలుగేళ్లలో తొలిసారి సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణం తీసుకున్నారు. రోజుల వ్యవధిలోనే బలనిరూపణ చేయడంలో విఫలం కావడంతో సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత శివసేనలో చీలిక వచ్చి ఏక్‌నాథ్ షిండే సీఎంగా, ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు మహాఘట్ బంధన్ కూటమిలోని శివసేన తర్వాత ఎన్సీపీలోనూ ఒక వర్గంగా తయారై తిరుగుబాటు చేసి ప్రభుత్వంలో చేరారు. ఇప్పుడు అజిత్ పవార్ మరోసారి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీన్ని ట్రిపుల్ ఇంజిన్ సర్కారుగా చూడరాదని, ఒక ఇంజిన్ ఫెయిల్ అయిందని గ్రహించాలని సంజయ్ రౌత్ వివరించారు. శివసేన పార్టీపై తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపిన ఏక్‌నాథ్ షిండే వర్గంపై అనర్హత వేటు పడుతుందని అన్నారు. అందుకే బీజేపీ ఎన్సీపీని చీల్చిందని ఆరోపించారు. తాను కెమెరా ముందు చెబుతున్నానని, త్వరలో మహారాష్ట్ర సీఎం మారుతారని తెలిపారు. ఏక్‌నాథ్ షిండేపై వేటు పడటం ఖాయమని జోస్యం చెప్పారు. కాబట్టి. తదుపరి సీఎంగా అజిత్ పవార్ బాధ్యతలు తీసుకుంటారని వివరించారు.
Also Read: Unmarried Pension: పెళ్లికాని వాళ్లకూ పింఛన్.. ప్రభుత్వం సమాలోచనలు
బీజేపీ దుష్ట రాజకీయాలకు నిన్నటి పరిణామం ప్రతీక అని సంజయ్ రౌత్ విమర్శలు కురిపించారు. మహారాష్ట్రలో ఇలాంటి రాజకీయ సంస్కృతి లేదని అన్నారు. ఇప్పుడు బీజేపీ ఇతర పార్టీలను చీల్చే కుట్రలు చేస్తున్నదని వివరించారు. గతంలో శివసేనను చీల్చారని, ఇప్పుడు ఎన్సీపీని చీల్చారని తెలిపారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌నూ చీలుస్తారని పలువురు అంటున్నారని పేర్కొన్నారు. ఈ చీలికలు దు:ఖదాయకమేనని అన్నారు. అయితే, ప్రజలు వారి కుటిలత్వాన్ని గమనిస్తున్నారని, ఎన్ని చీలికలు తెచ్చినా వచ్చే ఎన్నికల్లో తాము కలిసే పోరాడుతామని స్పష్టం చేశారు.