గవర్నర్‌ను వదిలేసి టేకాఫ్ అయిన విమానం.. వివాదంలో ఎయిరేసియా, చివరికి క్షమాపణలు
కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను ఎక్కించుకోకుండా ఎయిరేసియా విమానం టేకాఫ్ కావడం వివాదాస్పదమవుతోంది. దీనిపై ఎయిర్‌లైన్స్ క్షమాపణలు చెప్పింది. దీనిపై విచారణ జరుపుతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎయిరేసియా ఓ ప్రకటనను విడుదల చేసింది.

రాష్ట్ర గవర్నర్ స్థాయి వ్యక్తికి ఏ స్థాయిలో ప్రోటోకాల్ వుంటుందో తెలిసిందే. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి నిజమైన అధిపతి గవర్నరే. అలాంటి వ్యక్తి పట్ల ఎయిరేసియా విమానయాన సంస్థ అవమానకరంగా ప్రవర్తించింది. ఆయనను ఎక్కించుకోకుండానే విమానాన్ని టేకాఫ్ చేసింది. వివరాల్లోకి వెళితే.. గురువారం మధ్యాహ్నం బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ 2 నుంచి కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఎయిరేసియా విమానం ఎక్కాల్సి వుంది. కానీ ఆయనను ఎక్కించుకోకుండానే విమానం హైదరాబాద్‌కు బయల్దేరింది. ఇది కాస్తా వివాదాస్పదమైంది.
గవర్నర్‌ను ఎక్కించుకోకుండా ఎయిర్‌లైన్స్ సంస్థ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిందని అధికారులు మండిపడుతున్నారు. గవర్నర్ లగేజీని కూడా ఎయిరేసియాలో ఎక్కించారు. వీఐపీ లాంజ్ నుంచి టెర్మినల్ 2కు చేరుకునేలోపు విమానం టేకాఫ్ అయ్యిందని అధికారులు చెబుతున్నారు. గవర్నర్ రాకపై గ్రౌండ్ సిబ్బందికి సమాచారం అందించామని.. అన్ని ఏర్పాట్లు చేశామని వారు అంటున్నారు. దాదాపు 90 నిమిషాల తర్వాత గవర్నర్ మరో విమానంలో హైదరాబాద్ చేరుకున్నారని రాజ్ భవన్ అధికారులు వెల్లడించారు. దీనిపై ఎయిర్‌లైన్స్ యజమాన్యానికి ఫిర్యాదు చేశామని చెప్పారు.
వివాదం పెద్దది కావడంతో ఎయిరేసియా స్పందించింది. గవర్నర్ బోర్డింగ్ గేట్ వద్దకు చేరుకునేటప్పటికీ ఆలస్యం కావడం వల్ల విమానం వెళ్లిపోయిందని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎయిరేసియా ఓ ప్రకటనను విడుదల చేసింది. అత్యున్నత ప్రమాణాలు, ప్రోటోకాల్‌కు కట్టుబడి వుంటామని స్పష్టం చేసింది.