Asianet News TeluguAsianet News Telugu

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. రెండున్నర గంటలు గాల్లోనే చక్కర్లు

భారీ ప్రమాదం తప్పింది. పైలెట్లు సమయ స్ఫూర్తితో చాకచక్యంగా వ్యవహరించడంతో 141 మంది ప్రాణాలు సురక్షితం అయ్యాయి. 

Air India Flight Faces Technical Glitch, Circles for 2.5 Hours, Makes Emergency Landing in Tiruchirappalli GVR
Author
First Published Oct 12, 2024, 10:18 AM IST | Last Updated Oct 12, 2024, 10:33 AM IST

చెన్నై: తిరుచిరాపల్లి (తిరుచ్చి) నుంచి షార్జా వెళ్లే ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సమస్య తలెత్తడంతో అంతా ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. 141 మంది ప్రయాణికులతో శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు తిరుచ్చి నుంచి టేక్ ఆఫ్ అయింది. అయితే, సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలెట్లు దాదాపు రెండున్నర గంటల పాటు గాల్లోనే విమానాన్ని చక్కర్లు కొట్టించారు. ఆ తర్వాత రాత్రి 8.15 గంటలకు  విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.

 

కాగా, విమానం సురక్షితంగా ల్యాండ్ కావడానికి ముందు ఇంధనం, బరువును తగ్గించుకునేందుకు ఆకాశంలో పలుమార్లు చక్కర్లు కొట్టాల్సి వచ్చిందని ఎయిర్లైన్స్ ప్రతినిధి తెలిపారు. టేకాఫ్ అయిన వెంటనే విమానం హైడ్రాలిక్ సిస్టమ్స్, ల్యాండింగ్ గేర్ కు సంబంధించిన లోపం తలెత్తిందని వివరించారు. 

ఈ సందర్భంగా ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఆపరేటింగ్ సిబ్బంది ద్వారా ఎటువంటి అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు. సాంకేతిక లోపాన్ని గుర్తించిన తరువాత విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి చర్యలు చేపట్టాం. రన్‌ వే పొడవును పరిగణనలోకి తీసుకొని.. ఇంధనం, బరువును తగ్గించడానికి తగిన ముందుజాగ్రత్తగా నిర్ణీత ప్రాంతంలో అనేకసార్లు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించాం.' అని వివరించారు. 

లోపానికి గల కారణాలపై విచారణ జరుపుతామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం సాయంత్రం 6.05 గంటలకు పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించాం. ఆ తర్వాత విమానాశ్రయం, అత్యవసర బృందాలు వేగంగా, సమర్థవంతంగా స్పందించాయని పేర్కొన్నారు.

కాగా, తిరుచిరాపల్లి-షార్జా విమానంలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ పై ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ సమగ్ర విచారణ జరిపి లోపానికి గల కారణాలను తెలుసుకోనుంది.

బోయింగ్ 737 లాంటి ఇరుకైన బాడీ విమానాలకు ఇంధనాన్ని డంప్ చేసే అవకాశం లేదని, ఇంధనాన్ని కాల్చే అవకాశం ఉంటుందని బోయింగ్ సీనియర్ పైలట్ ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో విమానంలో ఇంధనాన్ని కాల్చడానికి, మొత్తం బరువును తగ్గించడానికి చుట్టూ తిరగవలసి వచ్చింది. ఇలా పైలెట్లు గాల్లోనే విమానాన్ని చక్కర్లు కొట్టించి.. బరువు తగ్గించి సేఫ్‌గా అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ సందర్భంగా కెప్టెన్, కో పైలట్‌ను తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అభినందించారు. 

#AirIndiaExpress విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని తెలిసి ఎంతో సంతోషించానని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ల్యాండింగ్ గేర్ సమస్య గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులతో ఫోన్ ద్వారా అత్యవసర సమావేశం నిర్వహించి.. ఫైర్ ఇంజిన్లు, అంబులెన్సులు, వైద్య సహాయంతో పాటు అవసరమైన అన్ని భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రయాణికులందరికీ భద్రత కల్పించాలని, మరిన్ని సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించామన్నారు. సురక్షితంగా ల్యాండ్ అయినందుకు కెప్టెన్, సిబ్బందికి అభినందనలు తెలిపారు స్టాలిన్‌.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios