మదర్సాలపై అస్సాం సీఎం హిమంత బిశ్వా  శర్మ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. మదర్సాల్లో విద్వేషం నేర్పడం లేదని.. సానుభూతి, ఆత్మగౌరవం నేర్పిస్తారంటూ చురకలు వేశారు. ముస్లింలు భారతదేశాన్ని సుసంపన్నం చేశారని ఒవైసీ ప్రశంసించారు.

మదర్సా (madrassa)లను మూసివేయాలంటూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ (Assam cm Himanta Biswa Sarma) చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత (mim) అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఫైర్ అయ్యారు. సంఘ్ పరివార్ శాఖల్లోలాగా మదర్సాల్లో విద్వేషం నేర్పడం లేదని.. సానుభూతి, ఆత్మగౌరవం నేర్పిస్తారని ఆయన చురకలు వేశారు. అంతే కాకుండా దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని ఓవైసీ ప్రస్తావిస్తూ ఆ సమయంలో ముస్లింలు బ్రిటిషర్లను ఎదుర్కోనే పోరాటంలో ఉంటే ఆర్ఎస్ఎస్ వారు బ్రిటిషర్ల ఏజెంట్లుగా వ్యవహరించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువులేని సంఘీలకు ఇది అర్థం కాదని.. హిందూ సంఘసంస్కర్త రాజా రాం మోహన్ రాయ్ (raja ram mohan roy) చదువుకున్నది మదర్సాలోనే ఒవైసీ గుర్తుచేశారు. ఆయన అక్కడ ఎందుకు చదువు చదువుకున్నారో వాళ్లకి అర్థం కాదంటూ ధ్వజమెత్తారు. ముస్లింలు భారతదేశాన్ని సుసంపన్నం చేశారని... అది కొనసాగుతుంది కూడా అన్నారు. 

ఇకపోతే.. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం హిమంత బిశ్వా శర్మ మాట్లాడుతూ పాఠశాలలు పెట్టి ఖురాన్‌ను (Quran) బోధించాల్సిన అవసరం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఖురాన్ గురించి చెప్పాలనుకుంటే ఇంట్లో చెప్పాలని సూచించారు. మీ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్ట్‌లు కావాలని... అనుకుంటే సైన్స్, మాథ్స్, బయోలజీ, బోటనీ, జూలజీ లాంటివి చదవాలని బిశ్వా శర్మ అన్నారు. ఈ చదువులు అన్ని పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయని.. ఇక ఖురాన్‌లు బోధించే మదర్సాలు అక్కర్లేదంటూ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ఆ పదం ఉనికిలో ఉండకూడదన్నారు.