ఎయిమ్స్ విద్యాసంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 3000 ఏళ్ల నాటి సుశ్రుతుడు ఆచరించిన సర్జరీ విధానంపై పరిశోధన చేపట్టనుంది. సుశ్రుతుడు సర్జరీ రికార్డులను, ప్రస్తుత మెడికల్ సర్జరీ విధానాలను పోల్చుతూ ఎయిమ్స్‌లోని ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్‌మెంట్ ఓ అధ్యయనం చేపట్టనుంది. 

న్యూఢిల్లీ: భారత వైద్యశాస్త్రం, ప్లాస్టిక్ సర్జరీ పితామహుడు మహర్షి సుశ్రుత ఆచరించిన సర్జరీ విధానంపై దేశ ప్రతిష్టాత్మక సంస్థ ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పరిశోధనలు చేయనుంది. మహర్షి సుశ్రుతుడి సర్జరీ విధానాన్ని రీసెర్చ్ చేయాలని ఎయిమ్స్ నిర్ణయించుకుంది. ఇందుకోసం గ్రాంటు విడుదల చేయాలని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను కోరింది.

ఆయుర్వేదంలో ఇది చాలా పురాతనమైన పద్ధతిగా పేర్కొంటుంటారు. సుశ్రుత సంహితను సుమారు 3000 ఏళ్ల క్రితం రచించారు. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలకు ముందే ఈ సుశ్రుత సంహితను రచించినట్టు చరిత్రకారులు భావిస్తున్నారు.

సుశ్రుతుడు సర్జరీ రికార్డులను, ప్రస్తుత మెడికల్ సర్జరీ విధానాలను పోల్చుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లోని ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్‌మెంట్ ఓ అధ్యయనం చేపట్టనుంది.

ఎయిమ్స్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ మనీష్ సింఘాల్ ప్రకారం, సుశ్రుత సంహితలో 150కి పైగా రకాల సర్జికల్ సాధనాలు ఉన్నాయని తెలిపారు. ఆధునిక పరికరాలతో పోల్చితే అవేమంతా మంచివి కావన్న విషయాన్ని పక్కన పెట్టాలని వివరించారు. అప్పుడు వారు కత్తులు, సూదులు, టోంగ్‌లు, మరెన్నో పదునైన పరికరాలు, సహజమైన దారాన్ని వినియోగించారని తెలిపారు. వాటిని ఉడికించి స్టెరిలైజ్ చేసి వేర్వేరు అవసరాలకూ వినియోగించేవారని చెప్పారు.

ఆయుర్వేద నిపుణుల ప్రకారం, సుశ్రుత సంహితలో 184 అధ్యయనాలు ఉన్నాయి. వీటిలో 1120 రకాల వ్యాధులకు సర్జరీలను పేర్కొన్నారు. సర్జరీ కోసం వినియోగించే 700 రకాల మొక్కలను అందులో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. 12 రకాల బోన్ ఫ్రాక్చర్స్, 7 రకాల బోన్ డిస్‌లొకేషన్స్‌లకు సంబంధించిన వర్ణనలూ సుశ్రుత సంహితలో ఉన్నట్టు చెబుతారు.

ప్రస్తుత అధునాతన శాస్త్రసాంకేతికల కోణంలో పురాతన మెడికల్ వ్యవస్థ గురించి అధ్యయనం చేయనున్నట్టు ఎయిమ్స్ నిపుణులు చెప్పారు. మహర్షి సుశ్రుత కాలంలో ఎలాంటి పరికరాలను వాడారనే విషయాన్నీ పరిశీలించబోతున్నట్టు పేర్కొన్నారు.

ఆధునిక సర్జరీ విధానం 400 ఏళ్ల క్రితం మొదలైనట్టుగా భావిస్తారు. స్కాట్లాండ్‌కు చెందిన ఓ డాక్టర్ ఈ సర్జరీ చేసినట్టు పేర్కొంటారు. 

ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 98 ప్రత్యేక ప్లాస్టిక్ సర్జన్‌‌లు ఎయిమ్స్‌ చేరుకున్నారు.