న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంచడం ఖాయమని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ ఎన్నికల్లో సత్యమే గెలుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ చేసిన విమర్శలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. 

నరేంద్రమోదీ తన తల్లిదండ్రులపై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. మోదీ తల్లిదండ్రులు రాజకీయాల్లో లేరని వారి గురించి తాను ఎప్పుడూ అభ్యంతరకరంగా వ్యాఖ్యానించలేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తన తల్లిదండ్రుల గురించి మోదీ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు.

బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్రమోదీల దగ్గర లెక్కలేనంత డబ్బు ఉందన్నారు. ఆ డబ్బుతో గెలవాలని వారు ప్రయత్నించారని ఆరోపించారు. గత ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ బాధ్యతను సమర్థవంతంగా వ్యవహరిస్తోందన్నారు. 

కాంగ్రెస్ పార్టీ నీతివంతంగా ఎన్నికలకు వెళ్లిందన్నారు. ప్రధాని ఎవరు అనేది ప్రజలు నిర్ణయిస్తారని స్పష్టం చేసిన రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో సత్యమే గెలుస్తోందని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, దారుణాలు ప్రజలు మరచిపోలేదంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. 

కానీ ప్రధాని నరేంద్రమోదీ తాను ఏం చేసినా అద్భుతమంటూ చెప్పుకొస్తారని విమర్శించారు. అయితే ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడినా తప్పు అంటూ క్రియేట్ చేస్తారని చెప్పుకొచ్చారు. మోదీ ప్రభుత్వంలో అనేక స్కాంలు జరిగాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. 

రాఫెల్ స్కాంపై చర్చకు రావాలని సవాల్ విసిరినా మోదీ స్పందించలేదని రాహుల్ స్పష్టం చేశారు. ఇకపోతే ఎన్నికల సంఘంపైనా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈసారి ఎన్నికల్లో ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించిందని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ గానీ బీజేపీ నేతలు గానీ చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. 

బీజేపీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈసీ స్పందించలేదన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని మాత్రం అడ్డుకుందన్నారు. తమ పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చిందని, చర్యలు తీసుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.