తమకు ప్రత్యామ్నాయంగా రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహాత్మకంగా వ్యవహారిస్తోన్న తమిళ అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్‌లపై అన్నాడీఎంకే విరుచుకుపడింది. ఏఐఏడిఎంకే అధికార పత్రిక నమదు అమ్మ పత్రికలో ఈ మేరకు ఓ పద్యం ప్రచురితమైంది.. ఇందులో కమల్, రజనీకాంత్‌లతో పాటు అన్నాడీఎంకే వ్యతిరేకంగా మట్లాడుతున్న సినీ నిర్మాతలు, దర్శకులు, సామాజిక కార్యకర్తలను దొంగల ముఠాగా అభివర్ణించింది.

కమల్ హాసన్ ఒక పిరికిపంద అని.. అమ్మ బతికున్నంతకాలం చడీ చప్పుడు లేకుండా ఉండి.. ఆవిడ మరణం తర్వాత రాజకీయ పార్టీ పెట్టి దోపిడికి సిద్ధమయ్యారని ఆరోపించింది.. ఇదే దారిలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా నడుస్తున్నారని పేర్కొంది.. అమ్మ బతికున్న రోజుల్లో ఈ విదూషకుల ముఠాను సెయింట్ జార్జ్ కోట వంక చూడటానికే భయపడేవారని పద్యంలో రాశారు..

తాను ఇక సినిమాల్లో నటించబోనని చెప్పి.. రామనాథపురంలో పార్టీ పేరును ప్రకటించారు యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్. మక్కల్ నిది మయ్యమ్ పేరుతో పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.. పార్టీ పెట్టడానికి ముందు నుంచే బీజేపీపై తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతూ.. కాంగ్రెస్‌కు దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీలతో పాటు ఇతర ప్రాంతీయ పక్షాల అధినేతలతో సమావేశమై.. బీజేపీయేతర పక్షాలకు తన మద్ధతు ఉంటుందని చెప్పకనే చెప్పారు.

తాజాగా పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీ వెళ్లి అక్కడ రాహుల్, సోనియాలతో భేటీ అవ్వడం మరింత చర్చనీయాంశమైంది. దీనితో పాటు అన్నాడీఎంకే ప్రభుత్వ అవినీతి, తూత్తుకుడిలో స్టెరిలైట్ ఫ్యాక్టరీ విషయంలో కాల్పులు, చెన్నై-సేలం గ్రీన్ కారిడార్ విషయంలో తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ... ఆ రాష్ట్రంలోని రాజకీయ శూన్యతను తనకు అనుకూలంగా మలచుకునేందుకు కమల్ హాసన్ పావులు కదుపుతున్నారు..

ఇక మరో అగ్రనటుడు, సూపర్‌స్టార్ రజినీకాంత్ కూడా తాను 2021లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తానని.. త్వరలోనే పార్టీ పేరును ప్రకటిస్తానని చెప్పారు.. దీనిలో భాగంగా వరుస పెట్టి అభిమానులతో రాజకీయ సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు.. తూత్తుకూడిలో కాల్పుల ఘటనలో మరణించిన వారి కుటుంబసభ్యులను పరామర్శించి.. ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక అన్నాడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న దర్శకులు అమీర్, బాలా, గౌతమన్, కారుపణియప్పన్‌లపై పద్యంలో దుమ్మెత్తిపోశారు.. ఈ దర్శకులందరికి చేతిలో సినిమాలు లేక ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించింది.

అలాగే అమ్మ మరణించిన తర్వాత వృద్ధ దర్శకులైన భారతీరాజా, పార్థిబన్‌లు ప్రతి పది రోజులకోకసారి ప్రెస్ మీట్లు పెడుతున్నారంటూ విమర్శించింది. అలాగే స్టెరిలైట్ ఫ్యాక్టరీ, చెన్నై-సేలం ఎనిమిది లైన్ల గ్రీన్ కారిడార్ విషయంలో విమర్శలు చేస్తున్న సామాజిక కార్యకర్తలపైనా పద్యంలో విమర్శల వర్షం కురిపించారు. ఇంతగా చెబుతున్న వారు అప్పుడు ఒక్క రోజైనా సచివాలయానికి వచ్చి అమ్మ ముందు ఎందుకు మాట్లాడలేదని పద్యాన్ని ముగించే ముందు ప్రశ్నించారు.