డీఎండీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయకాంత్‌కు షాక్ తగిలింది. తమిళనాడు లోక్‌సభ, శాసనసభ ఉప ఎన్నికల ప్రచారంలో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ తనయుడు ప్రచారం చేయడాన్ని అన్నాడీఎంకే అధిష్టానం నిషేధించింది.

విజయకాంత్ విదేశాల్లో చికిత్స అనంతరం చెన్నైలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు తన పెద్ద కుమారుడు విజయ్ ప్రభాకరన్‌ను నియమించారు.

ఈ క్రమంలో ప్రభాకరన్‌ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి పార్టీల, అభ్యర్ధులకు మద్ధతుగా ఆయన ప్రచారం చేశారు. అయితే ప్రభాకరన్‌ స్పీచ్‌ అన్నాడీఎంకే అధిష్టానానికి నచ్చలేదు.

దీంతో నాలుగు శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమికి ప్రచారం చేసేందుకు విజయ్‌ ప్రభాకరన్‌కు అనుమతి నిరాకరించింది.

తమిళ పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కూటమి పార్టీలకు సీట్లు కేటాయించినా, 18 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో మాత్రం సొంతంగా పోటీ చేసేలా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఒప్పందం చేసుకున్నాయి.

ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఉప ఎన్నికల్లో విజయం కావడంతో అన్నాడీఎంకే.. అధిక స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో డీఎంకే అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తున్నాయి.