టాటా సన్స్ కష్టాలకు కారణం రతన్ టాటా?: 4న ఎన్సీఎల్టీ తీర్పు

Ahead of NCLT verdict, Cyrus Mistry fires fresh salvo at Tata Sons
Highlights

చారిటీకి పెట్టింది పేరు టాటా సన్స్. అలాగే ఉప్పు నుంచి ఉక్కు వరకు ఆ సంస్థ సేవలందించని రంగం కూడా లేదంటే అతిశయోక్తి కాదు.

ముంబై: చారిటీకి పెట్టింది పేరు టాటా సన్స్. అలాగే ఉప్పు నుంచి ఉక్కు వరకు ఆ సంస్థ సేవలందించని రంగం కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఏనాడూ లాభాపేక్షకు ప్రాధాన్యం ఇవ్వని సంస్థ టాటాసన్స్. కానీ ఆ సంస్థ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ మాత్రం ‘టాటా సన్స్’ కష్టనష్టాలకు దాని చైర్మన్ ఎమిరస్ రతన్ టాటా, ప్రస్తుత చైర్మన్ చంద్రశేఖరన్ అనుసరిస్తున్న వ్యూహమేనని నిప్పులు చెరిగారు. టెలికం సంస్థ ‘టాటా టెలీ సర్వీసెస్‌ను భారతీ ఎయిర్ టెల్ సంస్థకు ఉచితంగా అప్పగించడం, భారీ నష్టాల్లో కూరుకున్న సంస్థలను టాటా సన్స్ కొనుగోలు చేయడంలో హేతుబద్దతేమిటని ప్రశ్నించారు.2016 అక్టోబర్ 24వ తేదీన టాటా సన్స్ చైర్మన్‌గా అర్ధంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ, తన ఉద్వాసనను సవాల్ చేస్తూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ముందు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం తీర్పు వెలువడనున్నది. ఈ నేపథ్యంలో టాటా సన్స్ ప్రస్తుత యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాల్లో హేతుబద్ధతను సవాల్ చేస్తూ తాజాగా సైరస్ మిస్త్రీ ఎనిమిది పేజీల ఘాటు లేఖ రాశారు.

టాటా సంస్థల లాభాల తగ్గుదలకు కారణాలేమిటో చెప్పండి


టాటా స్టీల్‌తో ఏమాత్రం సరిపోలని థ్యేస్సెంక్రప్ సంస్థతో బంధం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)‌లో లాభాల తగ్గుదలకు కారణాలేమిటో చెప్పాలని కోరారు. టాటా సన్స్ సంస్థలో సైరస్ మిస్త్రీ కుటుంబం 18.34 శాతం వాటా కలిగి ఉన్నది. ఈ నేపథ్యంలో టాటాగ్రూప్ సంస్థల్లో జవాబుదారీతనాన్ని అమలు చేయడంతోపాటు అవసరమైన సమాచారం అందజేయాలని కోరారు. మిస్త్రీ కంపెనీల్లో ఒక్కటైన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ తరుఫున టాటా సన్స్ డైరెక్టర్లకు ఈ లేఖ రాశారు. టాటా గ్రూప్ వ్యూహం, పనితీరు, సుపరిపాలన తీరుపై ధ్వజమెత్తారు. కానీ ఈ లేఖపై సైరస్ మిస్త్రీ కార్యాలయం స్పందించలేదు. టాటా సన్స్ అధికార ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. 

ప్రమోటర్ల అణచివేతకు టాటా సన్స్ చర్యలు


టాటా సన్స్ గ్రూప్ చైర్మన్‌గా, డైరెక్టర్‌గా తనను తొలగించడంతో గ్రూప్ ప్రమోటర్లను టాటా ట్రస్టులు అణచివేతకు పూనుకున్నాయని సైరస్ మిస్త్రీ ఆరోపించారు. టాటా సన్స్‌లో టాటా ట్రస్టులకు 68 శాతం వాటా ఉంది మరి. టాటా గ్రూప్ సంస్థల్లో సుపరిపాలనకు, పురోగతితోపాటు మైనారిటీ వాటాదారులకు కూడా టాటా సన్స్ పాలక మండలి జవాబుదారీగా ఉండాలని గుర్తు చేశారు. ప్రస్తుతం సంస్థల్లో పలు సమస్యలు సవాళ్లు విసురుతున్నా మీడియా మేనేజ్మెంట్ వెనుక ఇబ్బందికర పరిస్థితులను టాటా సన్స్ దాట వేస్తున్నదని సైరస్ మిస్త్రీ ఆరోపించారు. 

ఎయిర్ టెల్‌కు టాటా టెలీ అప్పగింతతో ఒరిగిందేమిటి?


భారతీ ఎయిర్ టెల్ సంస్థకు టాటా టెలీ సర్వీసెస్‌ను అప్పనంగా అప్పగించడం వల్ల టాటా సన్స్ యాజమాన్యానికి ఒనగూడిందేమీ లేదని సైరస్ మిస్త్రీ ఎద్దేవా చేశారు. అదలా ఉంటే టాటా టెలీ సర్వీసెస్‌కు చెందిన నాలుగు కోట్ల మంది, స్పెక్ట్రం, టాటా టెలీస్ ఫైబర్ నెట్ వర్క్ అంతా భారతీ ఎయిర్ టెల్ సంస్థకు అదనపు లాభమేనని ఆరోపించారు. దీనికి తోడు భారతీ ఎయిర్ టెల్ సంస్థ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.30 వేల కోట్లు పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్ టెల్ సంస్థకు టాటా టెలీ కమ్యూనికేషన్స్ సంస్థను అప్పనంగా అప్పగించడంలో తార్కికత తనకేమీ అర్థం కావడం లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనికితోడు భారతీ ఎయిర్ టెల్ సంస్థకు విక్రయించడానికి ముందు టాటా టెలీ సర్వీసెస్ సంస్థకు గల రూ.26 వేల కోట్ల రుణం చెల్లింపును పూర్తి చేశారని గుర్తు చేశారు. టాటా మాజీ ఉద్యోగి ఒక ప్రైవేట్ సంస్థ సాయంతో కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినా ఎందుకు స్పందించలేదని నిలదీశారు. 

టాటా సన్స్ నిర్ణయాలు సంత్రుప్తినిస్తున్నాయా? అని డైరెక్టర్లను నిలదీసిన మిస్త్రీ టాటా సన్స్ నిర్ణయాలు సంత్రుప్తినిస్తున్నాయా? అని గ్రూప్ డైరెక్టర్లను సైరస్ మిస్త్రీ ప్రశ్నించారు. జయేం ఆటో, ఓలా సంస్థలతో టాటా మోటార్స్ సంస్థల లావాదేవీలు, రతన్ టాటా పెట్టుబడులపై డైరెక్టర్లు సంత్రుప్తిగా ఉన్నారా? అని నిలదీశారు. బ్రిటిష్ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థ నష్టాల్లో ఉండగా కొనుగోలు చేసిన టాటా మోటార్స్ పై ప్రతికూల ప్రభావం పడటం లేదా? అని ఆ లేఖలో ప్రశ్నించారు. కోరస్ సంస్థ స్వాధీనంతో టాటా స్టీల్స్ నష్టాల్లో చిక్కుకోలేదా? అని గుర్తు చేశారు. ఇదిలా ఉంటే తాజాగా నష్టాల్లో ఉన్న భూషణ్ స్టీల్స్ సంస్థను రూ.350 బిలియన్లు, భూషణ్ పవర్ అండ్ స్టీల్స్ సంస్థను రూ. 240 బిలియన్ డాలర్లు కొనుగోలు చేయడం, కళింగనగర్ ప్రాజెక్టును రూ.230 బిలియన్లతో విస్తరించాలని ప్రణాళికలు రూపొందించడం టాటా స్టీల్‌కు సమస్యలు తలెత్తవా? అని నిలదీశారు. 

షేర్ల బై బ్యాక్‌తో టీసీఎస్ కేపిటలైజేషన్ పెంచడం తప్పుకాదా?


టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), టాటామోటార్స్, టాటా పవర్ సంస్థల్లో వరుసగా లాభాలు తగ్గడానికి కారణాలేమిటని ప్రశ్నించారు. టీసీఎస్ లాభాలు తగ్గుముఖం పట్టడంతో సంస్థ యాజమాన్యం సంప్రదాయ పద్ధతులకు భిన్ంనగా షేర్ల బై బ్యాక్‌తో సంస్థ మార్కెట్ కేపిటలైజేషన్‌ను రూ.7 లక్షల కోట్లకు పెంచిన మాట అబద్దమా? అని పేర్కొన్నారు. ఎయిర్ ఆసియా భారత్ బోర్డులోకి టాటా సన్స్ బోర్డు నామినీగా నియమితులైన ఆర్ వెంకట్రామన్‌పై అంతర్గత దర్యాప్తు చేయకుండానే ఎలా క్లీన్ చిట్ ఇచ్చారని నిలదీశారు. టాటా సన్స్ బోర్డు తన పనితీరులో మిస్ మేనేజ్మెంట్, అదేపనిగా రిస్కులను ఆహ్వానించడం వల్ల గ్రూప్ సంస్థల్లో పని చేస్తున్న లక్షల మంది టాటా సంస్థల ఉద్యోగులకు అసాధారణమైన ఘోరమైన సందేశాన్నివ్వడమేనని హెచ్చరించారు. 

loader