లోక్ సభ లో వ్యవసాయానికి సంబంధించిన బిల్లు దేశంలో సృష్టిస్తున్న ప్రకంపనలు అన్ని, ఇన్నీ కావు. ఏకంగా కేంద్ర మంత్రి, అకాలీదళ్ నేత హరిసిమ్రత్ కౌర్ బాదల్ రాజీనామా చేసారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమిస్తున్నారు కూడా. 

ఈ విషయం కాక రేపుతున్న తరుణంలో కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్ ఝా బాంబు పేల్చారు. ఏపిఎంసి చట్టం రద్దు, వ్యవసాయాన్ని ఉత్పత్తులపై కొనసాగుతున్న నియంత్రణల్ని రద్దు చేయాలని కాంగ్రెస్ కూడా తన 2019 మానిఫెస్టోలో పొందు పరిచిన విషయం బయటపెట్టాడు. 

ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటే అని.... అదే విషయాన్నీ మోడీ చేసి చూపారన్నారు సంజయ్ ఝా. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇదే విషయాన్నీ చెప్పారు. తాము పాస్ చేసిన ఆర్డినెన్సును... కాంగ్రెస్ కూడా తమ మానిఫెస్టోలో పొందుపరిచిందని గుర్తు చేసారు. 

ఈ ఆర్డినెన్సు వల్ల రైతులకు దళారుల నుండి, దళారీ వ్యవస్థ నుండి పూర్తి విముక్తి కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. తమ మానిఫెస్టోలో ఈ విషయం పొంది పరిచిన పార్టీలు కూడా ఇప్పుడు ఈ విషయంలో రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని మండిపడ్డారు. ఇలాంటి రెండు నాల్కల ధోరణి ప్రదర్శించే వారిని నమ్మొద్దని, రైతులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోడీ కోరారు.