అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకునే ఛాన్సే లేదని బీజేపీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ స్కీంకు వ్యతిరేకంగా యువకులు ఆందోళన చేస్తున్న విషయాన్ని ధ్రువీకరిస్తూనే.. అక్కడ కొన్ని.. ఇక్కడ కొన్ని ఆందోళనలు జరిగినంత మాత్రానా అవి దేశంలోని మొత్తం యువత అభిప్రాయాలను వెల్లడిస్తాయని భావించరాదని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అగ్నిపథ్ స్కీం గురించి ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నా.. ఆ స్కీంను వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా కేంద్రం ఖాతరు చేయడం లేదు. కానీ, ఆందోళనకారులు లేవనెత్తుతున్న కొన్ని సమస్యలను పరిష్కరించే పనిలో పడింది. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖలు, పలు రాష్ట్రాలు ఉద్యోగ భద్రతకు చర్యలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ ప్రతినిధి గురు ప్రకాశ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అగ్నిపథ్ స్కీంను వెనక్కి తీసుకునే ఛాన్సే లేదని ఆయన అన్నారు. అన్ని భాగస్వాముల నుంచి పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ పథకాన్ని రూపొందించినట్టు వివరించారు. ఇప్పుడు ఈ పథకానికి చాలా మంది నుంచి మద్దతు లభిస్తున్నదని, కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ నుంచి కూడా ఈ స్కీంకు సపోర్ట్ వచ్చిందని తెలిపారు.
అయితే, ఈ స్కీంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న విషయం వాస్తవమేనని, కానీ, ఈ ఆందోళనలు దేశంలోని మొత్తం యువత అభిప్రాయాలను వెల్లడించవని ఆయన పేర్కొన్నారు. అక్కడక్కడ ఆందోళనలు జరిగినంత మాత్రాన దేశ యువత మూడ్ ఇదేనని తేల్చి చెప్పలేమని అన్నారు. ఎవరికైనా ఎలాంటి అనుమానాలు వచ్చిన సంబంధిత అధికారు ముందు లేవనెత్తి వాటిని నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. అంతేకానీ, ఈ నిరసనలు దేశ యువత మొత్తం మూడ్‌ను వెల్లడించబోదని చెప్పారు. నిజానికి యువత కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిందని వివరించారు. స్టార్టప్ స్కీమ్, ముద్ర లోన్ స్కీం వంటి ఎన్నో పథకాలు ఎన్డీయే హయాంలో యువతకు ప్రయోజనాలను చేకూర్చిందని తెలిపారు.
