త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం గతేడాది కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే దేశ సైనిక చరిత్రలో పరివర్తన సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్ కోసం గతేడాది కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఎంపికైనవారిని అగ్నివీర్లుగా పిలుస్తున్నారు. అయితే దేశ సైనిక చరిత్రలో పరివర్తన సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఈ పథకం కింద ఎంపిక చేసిన యువతలో 25 శాతం మందినే నాలుగేళ్ల తర్వాత ఆర్మీలో రెగ్యూలర్ క్యాడర్ తీసుకోనున్నారు. అయితే దీనిని 25 నుంచి 50 శాతంకు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉన్న విశ్వసనీయ వర్గాలు ఏషియానెట్ న్యూస్‌బుల్‌కి తెలిపాయి. అంతేకాకుండా.. సాంకేతిక నేపథ్యం ఉన్న యువకులను చేర్చుకోవడం, గరిష్ట వయోపరిమితిని 23 సంవత్సరాలకు పెంచాలనే ప్రతిపాదన కూడా ఉందని పేర్కొన్నాయి.
భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు చర్చలో ప్రతిపాదనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. ‘‘సాయుధ దళాలలో తగ్గుతున్న మానవశక్తి స్థాయిలను పరిష్కరించే లక్ష్యంతో.. సైనికుల స్థాయిలో శాశ్వత ప్రాతిపదికన 50 శాతం అగ్నివీర్లను తీసుకోవాలనే ప్రతిపాదనలపై పనులు పురోగతిలో ఉన్నాయి’’ అని ఆ వర్గాలు తెలిపాయి.
రాబోయే మూడు సంవత్సరాల్లో బలగాలు పరిమిత సంఖ్యలో రిక్రూట్‌మెంట్‌లను కలిగి ఉన్నాయనే సంగతి తెలిసిందే. ‘‘ఏవియేషన్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ వంటి సాంకేతిక స్ట్రీమ్‌లలో అర్హత కలిగిన అగ్నివీర్‌లను చేర్చడంలో మేము సవాళ్లను ఎదుర్కొంటున్నాము. ఈ అంశం ఉన్నత స్థాయిలో కూడా చర్చలో ఉంది’’ అని ఆ వర్గాలు తెలిపాయి.
ఇక, జూన్ 2022లో ప్రారంభించబడిన అగ్నిపథ్ పథకం కింద 17.5 - 21 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులను అగ్నివీర్ పోస్టుల కోసం పరిశీలిస్తున్నారు. అయితే సాంకేతిక నేపథ్యం ఉన్న అభ్యర్థుల విషయంలో గరిష్ట రిక్రూట్‌మెంట్ వయస్సు 21 ఏళ్లలోపు పరిమితిని సడలించే అవకాశాలు ఉన్నాయని బలగాలు అభిప్రాయపడుతున్నాయి. ‘‘గరిష్ట వయోపరిమితిని సవరించడం.. దానిని 23 సంవత్సరాలకు పెంచడంపై చర్చ జరుగుతోంది. అది ప్రకటించబడిన తర్వాత.. మేము యువతను పాలిటెక్నిక్ సంస్థల నుంచి ఉత్తీర్ణులయ్యేలా చేయవచ్చు’’ అని ఆ వర్గాలు తెలిపాయి.
అంతేకాకుండా ప్రతిపాదనల్లో భాగంగా.. “సైనికుల స్థాయిలోని లోపాలను పూడ్చేందుకు రిక్రూట్‌మెంట్ ర్యాలీల సంఖ్యను పెంచాలని మేము యోచిస్తున్నాము. లేకుంటే అది పూర్తి కావడానికి సంవత్సరాలు పడుతుంది. క్రియాత్మక, కార్యాచరణ సమస్యలను కూడా కలిగి ఉంటుంది’’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలాఉంటే, 2026 నాటికి దాదాపు 1.75 లక్షల మంది యువకులు అగ్నిపథ్ పథకం కింద చేరనున్నారనే అంచనాలు ఉన్నాయి. 2022 జూన్‌లో అప్పటి సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి మాట్లాడుతూ.. సమీప భవిష్యత్తులో అగ్నివీరుల సంఖ్య 1.25 లక్షలకు చేరుతుందని చెప్పారు. ‘‘రాబోయే 4-5 సంవత్సరాలలో.. మన (సైనికుల) సంఖ్య 50,000-60,000కు, తరువాత 90,000-1 లక్షలకు పెరుగుతుంది. స్కీమ్‌ను విశ్లేషించడానికి, మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంపొందించడానికి మేము 46,000 వద్ద చిన్నగా ప్రారంభించాము’’ అని పేర్కొన్నారు.
అయితే ప్రతి ఏడాది దాదాపు 60,000 మంది సైనికులు పదవీ విరమణ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే మూడు సర్వీసుల్లో సైనికుల కొరత తీవ్రంగా ఉంది. ఇక, 2021లో ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లలో వరుసగా 1.18 లక్షలు, 11,587, 5,819 మంది సైనికుల కొరత గురించి పార్లమెంటుకు తెలియజేయబడింది.
