కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మండల్ ఖాన్ సోమవారం నాడు టీఎంసీలో చేరారు. 

రాష్ట్రంలోని బిష్ణూపూర్ నియోజకవర్గం నుండి సౌమిత్రా ఖాన్  ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంతేకాదు బీజేపీ అనుబంధ విభాగమైన భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా ఆయన పనిచేస్తున్నారు.సౌమిత్రాఖాన్ భార్య సుజాతా మండల్ ఖాన్ సోమవారం నాడు టీఎంసీ నేత సౌగతారాయ్, పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. 

2019లో తన భర్తను గెలిపించుకొనేందుకు తాను బీజేపీలో ఎంతో కష్టపడి పనిచేసినా తనకు పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదని  సుజాతా చెప్పారు. బీజేపీలో తనకు గుర్తింపు దక్కనందునే పార్టీ మారినట్టుగా ఆమె చెప్పారు.

సుజాతా టీఎంసీలో చేరడంపై సౌమిత్రాఖాన్  మండిపడ్డారు. త్వరలోనే తన భార్యకు విడాకుల నోటీసులు పంపనున్నట్టుగా ఆయన చెప్పారు.

తమ మధ్య 10 ఏళ్ల బంధానికి ఇలా ముగింపు పడుతుందని తాను అనుకోలేదన్నారు.  కొన్ని రోజులుగా తమ మధ్య విభేదాలున్నాయన్నారు. కానీ తాను తన నుండి దూరమౌతోందని తాను ఏనాడూ అనుకోలేదన్నారు.

సౌమిత్రాఖాన్ మాజీ టీఎంసీ నేత. 2019 జనవరిలో ఆయన బీజేపీలో చేరారు. బంకురా జిల్లాలోని బిష్ణుపూర్ నుండి బీజేపీ అభ్యర్ధిగా ఎంపీగా పోటీ చేసి ఆయన విజయం సాధించాడు. మూడు నెలల క్రితం ఆయన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.

తన కుటుంబం యొక్క ఇష్టానికి విరుద్దంగా  సౌమిత్రాఖాన్ ను పెళ్లి చేసుకొన్నట్టుగా ఆమె చెప్పారు. తన నుదుటిపై ఎర్రటి సింధూరం ఉంటుందని చెప్పారు. రాజకీయాల వల్ల వ్యక్తిగత సంబంధం ముగుస్తోందా అని ఆమె ప్రశ్నించారు.